గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్ మృతి

ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం స్పందించకపోవడంతో నానాటికీ సమ్మె ఉదృతమవుతోంది. నేటితో సమ్మె 19వ రోజుకు చేరింది. సెప్టెంబర్ నెల జీతాలు చెల్లించకపోవడంతో ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఆర్టీసీ కార్మికులు, మరోపక్క ప్రభుత్వం ఆర్టీసీని ప్రైవేటీకరించేందుకు చేస్తున్న ప్రయత్నాలను చూసి తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 

ముషీరాబాద్ డిపోలో ఆర్టీసీ డ్రైవరుగా పనిచేస్తున్న రమేష్ (37)కు రెండు రోజుల క్రితం తోటి కార్మికులతో కలిసి డిపో వద్ద ధర్నాలో పాల్గొన్నప్పుడు గుండెపోటు వచ్చింది. వెంటనే తోటి కార్మికులు ఆయనను మలక్‌పేటలోని యశోదా ఆస్పత్రిలో చేర్చారు. కానీ వైద్యులు ఎంతగా ప్రయత్నించినప్పటికీ రమేష్ ప్రాణాలు కాపాడలేకపోయారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుదవారం ఉదయం రమేష్ తుదిశ్వాస విడిచారు. దీంతో ఆర్టీసీ సమ్మె మొదలైన తరువాత చనిపోయిన వారి సంఖ్య మూడుకు చేరింది. ఏదో ఒక రోజున ప్రభుత్వం- ఆర్టీసీ జేఏసీ రాజీపడి సమ్మె ముగియడం ఖాయమే కానీ ఆలోగా ఇంకా ఎంతమంది ప్రాణాలు కోల్పోతారో తెలియదు. జీతాలు చెల్లించడానికే డబ్బు లేదని ఆర్టీసీ యాజమాన్యం చెపుతున్నందున రోడ్డున పడుతున్న ఆ కార్మికుల కుటుంబాలను ఎవరు ఆదుకొంటారు?