1.jpg)
ఆర్టీసీ జేఏసీ నేతలతో చర్చించి వీలైనంత త్వరగా సమ్మె ముగించాలనే హైకోర్టు ఆదేశాలపై ఎట్టకేలకు తెరాస సర్కార్ స్పందించింది. హైకోర్టు ఉత్తర్వుల కాపీ చేతికి అందిన తరువాత సిఎం కేసీఆర్ నిన్న ప్రగతి భవన్‌లో రవాణామంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ముఖ్య కార్యదర్శులు, ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమావేశమయ్యి కోర్టు ఉత్తర్వులపై లోతుగా చర్చించారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్‌ను కార్మిక సంఘాలు వదులుకొన్నట్లు ప్రకటించినందున, వారి మిగిలిన 21 డిమాండ్లపై అధ్యయనం చేయాలని నిర్ణయించారు. దీనికోసం ఈడీ టి.వేంకటేశ్వరరావు నేతృత్వంలో ఐదుగురు సభ్యులు కలిగిన ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీలో ఆర్ధిక సలహాదారు ఎన్.రమేశ్, ఈడీలు ఏ పురుషోత్తమ్, సి.వినోద్ కుమార్, వి. వెంకటేశ్వర్లు, ఈ.యాదగిరి సభ్యులుగా ఉంటారు. వారు ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై అధ్యయనం చేసి రెండు రోజులలో ఆర్టీసీ ఎండీకి నివేదికను అందజేస్తారు. దాని ఆధారంగా సిఎం కేసీఆర్ తుది నిర్ణయం తీసుకొంటారు. ఈ కేసుపై ఈ నెల 28న జరుగబోయే తదుపరి విచారణలో ఆ నివేదికను, ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టుకు తెలియజేయాలని సిఎం కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. కనుక నివేదిక వచ్చిన తరువాతైనా ప్రభుత్వం ఆర్టీసీ కార్మిక నేతలతో చర్చలు జరుపుతుందా..లేదా?అనేది తెలియదు. కనుక అప్పటి వరకు ఆర్టీసీ సమ్మె కొనసాగవచ్చు.
అద్దె బస్సులకు టెండర్లు పిలవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆర్టీసీ కార్మిక సంఘం నిన్ననే హైకోర్టులో మరో పిటిషన్ వేసినప్పటికీ అదనంగా మరో 1,000 అద్దె బస్సులను తీసుకోవడానికి ఆర్టీసీ యాజమాన్యం మళ్ళీ నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయించింది.