ఆర్టీసీపై హైకోర్టులో మరో పిటిషన్‌

ఆర్టీసీ సమ్మెపై ఇప్పటికే హైకోర్టులో అనేక పిటిషన్లు పెండింగులో ఉన్నాయి. రెండు రోజుల క్రితమే మరో మూడు పిటిషన్లు దాఖలు కాగా నేడు మరో పిటిషన్‌ దాఖలైంది. ఆర్టీసీ సమ్మె జరుగుతుండగా ఆర్టీసీ బోర్డు అనుమతి లేకుండా ఆర్టీసీ ఇన్-ఛార్జ్ ఎండీ అద్దె బస్సుల కొరకు టెండర్లు ఆహ్వానించడాన్ని సవాలు చేస్తూ మంగళవారం ఆర్టీసీ కార్మిక సంఘం హైకోర్టులో ఒక పిటిషన్‌ వేసింది. దానిపై నేడు హైకోర్టు సింగిల్ జడ్జ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రస్తుత పరిస్థితులలో ఆర్టీసీ యాజమాన్యం 100 శాతం సొంత బస్సులను నడిపించలేదని, సమ్మె కారణంగా ప్రజలకు ఇబ్బంది కలుగకూడదనే ఉద్దేశ్యంతోనే అద్దె బస్సులను నడిపించేందుకు టెండర్లు పిలిచామని ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ వాదించారు.