
ఆర్టీసీ యాజమాన్యం సెప్టెంబర్ నెల జీతాలు చెల్లించకపోవడంతో ఆర్టీసీ కార్మికులు తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సోమవారం ఉదయం కరీంనగర్ 1వ డిపోలో పనిచేస్తున్న జంపన్న అనే ఆర్టీసీ డ్రైవరు ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు కానీ అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకొని కాపాడారు.
ఆర్టీసీ కార్మికుల జీతాల చెల్లింపుపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఆర్టీసీ కార్మికులకు జీతాలు చెల్లించేందుకు ఆర్టీసీ యాజమాన్యం వద్ద సొమ్ము లేదని కనుక ప్రస్తుత పరిస్థితులలో జీతాలు చెల్లించలేమని ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ వాదించారు.
ఆర్టీసీ కార్మికుల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కనీసం హైకోర్టు అయినా వెంటనే నిర్ణయం తీసుకొంటుందని ఆశిస్తే, ఈ కేసును 29కి వాయిదా వేయడంతో ఆర్టీసీ కార్మికులు తీవ్ర నిరాశానిస్పృహలకు లోనయ్యారు. ఆర్టీసీ యాజమాన్యం జీతాలు చెల్లించబోదని స్పష్టం అవడంతో ఆర్టీసీ కార్మికులు తీవ్ర ఆందోళనతో ఉన్నారు. కనుక ఆర్టీసీ కార్మికులు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని జేఏసీ నేతలు, ప్రతిపక్షాలు పదేపదే విజ్ఞప్తి చేస్తున్నాయి.
ప్రభుత్వానికి-ఆర్టీసీ కార్మికులకు మద్య ప్రతిష్టంభన ఏర్పడి ఉండటంతో ఇప్పట్లో సమ్మె ముగిసే అవకాశాలు కూడా కనిపించడం లేదు. సెప్టెంబర్ నెలలో పనిచేసిన రోజులకు జీతం ఇవ్వడానికే ఆర్టీసీ యాజమాన్యం నిరాకరిస్తున్నప్పుడు, సమ్మె కాలానికి జీతం ఇస్తుందని ఎవరూ అనుకోలేరు. కనుక వారికి వచ్చే నెల కూడా జీతాలు అందవు. వరుసగా రెండు నెలలు జీతాలు అందకపోతే ఆర్టీసీ కార్మికుల కుటుంబ ఆర్ధిక పరిస్థితులు మరింత దయనీయంగా మారుతాయి. పైగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులను మళ్ళీ ఉద్యోగాలలోకి తీసుకోబోమని సిఎం కేసీఆర్ ప్రకటన, ఆర్టీసీని పాక్షికంగా ప్రైవేటీకరించడానికి ప్రభుత్వ ప్రయత్నాలు మొదలైనవన్నీ ఆర్టీసీ కార్మికులను తీవ్ర భయాంళనలకు, మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నాయి. ఇటువంటి సమయంలో వారిని ఆర్ధిక సమస్యలు కూడా చుట్టుముడితే ఆత్మహత్యలు చేసుకొనే ప్రమాదం ఉంటుంది. అప్పుడు పరిస్థితులు మరింత జటిలమవుతాయి. కనుక అందరూ పంతాలు, పట్టింపులు,బేషజాలు పక్కనపెట్టి ఈ సమస్యను తక్షణం పరిష్కరించాలి.