హుజూర్‌నగర్‌లో 84.45 శాతం పోలింగ్ నమోదు

హుజూర్‌నగర్‌లో 84.45 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. ఉపఎన్నికలలో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. గత ఏడాది జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికలలో 86.38 శాతం పోలింగ్ జరిగింది. అంటే గత ఎన్నికల కంటే ఈసారి 1.93 శాతం తక్కువగా పోలింగ్ జరిగిందన్న మాట. నియోజకవర్గంలో మొత్తం 2,36,842 ఓట్లు ఉండగా వాటిలో 2,00, 726 మంది తమ ఓటు హక్కును వినియోగించుకొన్నారు. ఉపఎన్నికలలో ఇంత భారీగా పోలింగ్ జరగడం విశేషమే. 

ఈనెల 24న ఓట్ల లెక్కించి ఆదేరోజున ఫలితాలు వెల్లడిస్తారు. ఓట్ల లెక్కింపు కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం చురుకుగా ఏర్పాట్లు చేస్తోంది. సూర్యాపేట మార్కెట్ యార్డులో ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. దీని కోసం 14 టేబిల్స్ ఏర్పాటు చేస్తున్నారు.    

ఈ ఎన్నికలలో తెరాస, కాంగ్రెస్‌, బిజెపి, టిడిపిలు పోటీ పడినప్పటికీ తెరాస, కాంగ్రెస్‌ మద్యే ప్రదానంగా పోటీ జరిగినట్లు స్పష్టమయింది. పోలింగ్ ముగియగానే తెరాస అభ్యర్ధి సైదిరెడ్డి ఘన విజయం సాధించబోతున్నారని ఆ పార్టీ తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ట్వీట్ చేశారు. కాంగ్రెస్‌ కూడా తమ అభ్యర్ధి పద్మావతి రెడ్డి గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తోంది. మరో రెండు రోజులలో ఎలాగూ ఫలితాలు వెలువడతాయి కనుక హుజూర్‌నగర్‌లో ఏ పార్టీ జెండా ఎగురవేస్తుందో తేలిపోతుంది.