ప్రగతి భవన్‌ ముట్టడికి కాంగ్రెస్‌ పిలుపు

ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా సోమవారం ప్రగతి భవన్‌ ముట్టడికి కాంగ్రెస్‌ పిలుపునీయడంతో పోలీస్ శాఖ ఆ ప్రాంతంలో భారీగా పోలీసులను మోహరించింది. కాంగ్రెస్‌ పిలుపు మేరకు ఇప్పటికే కాంగ్రెస్‌ కార్యకర్తలు, ఆర్టీసీ కార్మికులు ప్రగతి భవన్‌ ముట్టడికి బయలుదేరగా వారిని పోలీసులు మద్యలోనే అడ్డుకొని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యగా ప్రగతి భవన్‌ వైపు వస్తున్న వాహనాలను ఆపి వాహనదారులను ప్రశ్నించిన తరువాతే ముందుకు సాగేందుకు అనుమతిస్తున్నారు. నగరంలో కాంగ్రెస్‌, ఆర్టీసీకి చెందిన కొంతమంది ముఖ్యనేతలను గృహనిర్బందంలో ఉంచినట్లు సమాచారం.