హుజూర్‌నగర్‌లో ఎన్నికల ప్రచారం సమాప్తం

ఈనెల 21న మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నందున నేటి సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగిసింది. అలాగే 21న హుజూర్‌నగర్‌తో సహా దేశంలో  వివిద రాష్ట్రాలలోని 64 నియోజకవర్గాలలో ఉపఎన్నికలు జరుగనున్నాయి. వాటికి కూడా నేటి సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగిసింది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వ సమస్య ఎదుర్కొంటున్నందున ఈసారి బిజెపికి గట్టి పోటీ ఈయలేనట్లు కనిపిస్తోంది. కనుక హర్యానా, మహారాష్ట్రలో మళ్ళీ బిజెపి గెలిచి అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయని సర్వేలు జోస్యం చెపుతున్నాయి.

ఇక తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె కారణంగా హుజూర్‌నగర్‌ ఉపఎన్నికల సందడి తెలియకుండానే జరిగిపోతున్నాయి. ఈసారి హుజూర్‌నగర్‌ సీటును తెరాస కైవసం చేసుకొంటుందని అంచనాలు ఉన్నప్పటికీ ఆర్టీసీ సమ్మె ప్రభావం వలన కాంగ్రెస్ పార్టీ లాభపడే అవకాశాలు కూడా ఉన్నాయి. కనుక ఈసారి కూడా హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్‌, తెరాసల మద్య గట్టి పోటీ కనిపిస్తోంది. 

తెరాస అభ్యర్ధి సైదిరెడ్డిని ఓడించేందుకు కాంగ్రెస్‌, బిజెపి నేతలు రహస్య అవగాహన చేసుకొన్నారని మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపిస్తున్నారు. పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేస్తున్న ఫిర్యాదుల కాపీలు నేరుగా బిజెపి అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌కు చేరుతున్నాయని మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్‌, బిజెపిలు తెర వెనుక చేతులు కలపడం నిజమైతే తెరాస విజయావకాశాలు సన్నగిల్లినట్లే భావించవచ్చు. ఈనెల 21న పోలింగ్, 24న ఫలితాలు వెలువడతాయి.