హుజూర్‌నగర్‌లో నేడు రేవంత్‌ రెడ్డి ఎన్నికల ప్రచారం

కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డి నేడు హుజూర్‌నగర్‌లో పార్టీ అభ్యర్ధి పద్మావతి తరపున ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఈ ఉప ఎన్నికలకు ఆయన కాంగ్రెస్‌ అభ్యర్ధిగా వేరే వ్యక్తిని సూచించినప్పటికీ, పార్టీ అధిష్టానం ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి రెడ్డికే టికెట్ ఖరారు చేయడంతో ఆయన అలిగి ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటారని అందరూ అనుకొన్నారు. కానీ రేవంత్‌ రెడ్డి బేషజానికి పోకుండా నేడు, రేపు హుజూర్‌నగర్‌లో పార్టీ అభ్యర్ధి పద్మావతి తరపున ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఎన్నికల ప్రచారం ముగిసే ముందు, హుజూర్‌నగర్‌లో సిఎం కేసీఆర్‌ ఎన్నికల సభ వర్షం కారణంగా రద్దు కావడం, రేవంత్‌ రెడ్డివంటి బలమైన నాయకుడు ప్రచారానికి వస్తుండటం కాంగ్రెస్‌ అభ్యర్ధి పద్మావతి రెడ్డికి కలిసివచ్చే అంశమే. రేవంత్‌ రెడ్డి తన ఎన్నికల ప్రచారంలో ఆర్టీసీ సమ్మెపై సిఎం కేసీఆర్‌ వైఖరిని తప్పు పడుతూ విమర్శలు చేయవచ్చు. 

ఆర్టీసీ సమ్మె నేపధ్యంలో జరుగుతున్న ఈ ఉపఎన్నికలలో ఒకవేళ తెరాస అభ్యర్ధి సైదిరెడ్డి గెలిచినట్లయితే, సమ్మెపై సిఎం కేసీఆర్‌ వైఖరిని ప్రజలు సమర్ధిస్తునట్లు లేకుంటే తప్పుగా భావిస్తున్నట్లు అనుకోవచ్చు. ఒకవేళ ఈ ఉపఎన్నికలలో కాంగ్రెస్‌ అభ్యర్ధి పద్మావతి రెడ్డి గెలిచినట్లయితే, కాంగ్రెస్‌ నేతలు ఐకమత్యంగా పనిచేస్తే తెరాసను ఎదుర్కొని ఓడించగలరని కూడా నిరూపితమవుతుంది. కనుక ఏ ఉపఎన్నికలు కాంగ్రెస్‌, తెరాస రెంటికీ చాలా ప్రతిష్టాత్మకమైనవేనని చెప్పవచ్చు. హుజూర్‌నగర్‌లో ఈనెల 21 పోలింగ్, 24న ఫలితాలు వెలువడతాయి.