తెలంగాణ ఉద్యమకారుడు ఆమోస్ మృతి

తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్న ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్సీ కెఆర్ ఆమోస్ (76) మల్కాజ్‌గిరిలోని తన నివాసంలో గురువారం రాత్రి కన్నుమూశారు. తొలిదశ తెలంగాణ ఉద్యమాలు జరుగుతున్నప్పుడు వాటిలో పాల్గొన్నందుకు ఆమోస్ ఉద్యోగం కోల్పోయారు. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో ప్రవేశించి ఏపీసిసి కార్యదర్శిగా సేవలందించారు. సమైక్య రాష్ట్రంలో రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ తరపున 2004,2007లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అప్పుడే పార్టీలో ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను కూడగట్టుకొని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పార్టీ అధిష్టానంపై చాలా ఒత్తిడి చేశారు.

టిఎన్జీవో అధ్యక్షుడిగా ఆమోస్ చాలా కాలంపాటు సేవలందించారు. వారితో ఉన్న బలమైన అనుబంధం, పరిచయాల వలన మలిదశ ఉద్యమాలలో ఉద్యోగ సంఘాలను ఉత్తేజపరిచి అందరూ చురుకుగా ఉద్యమాలలో పాల్గొనేలా చేశారు. తెలంగాణ ఏర్పడిన తరువాత ఆయన ఆయన తెరాసలో చేరారు. కానీ పార్టీలో ఆశించినంత గుర్తింపు, గౌరవం లభించలేదనే అసంతృప్తితో బాధపడుతుండేవారని ఆయన అర్ధాంగి చెప్పారు. ఆ కారణంగా ఆయన గత కొంతకాలంగా రాజకీయాలకు, పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. గత కొంతకాలంగా ఆయన మానసికంగా చాలా కృంగిపోయున్నారని, నిన్న రాత్రి గుండెపోటు రావడంతో ఇంట్లోనే కుప్పకూలిపోయారని ఆమె తెలిపారు. 

ఆమోస్ మృతిపట్ల సిఎం కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, హరీష్‌రావు, ఈటల రాజేందర్‌, నిరంజన్ రెడ్డి, టిఎన్జీవో అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి, పలువురు కాంగ్రెస్‌, తెరాస నేతలు సంతాపం తెలిపారు.