ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం సీరియస్ వార్నింగ్

నేటి నుంచి నిరవధిక సమ్మె ప్రారంభించిన ఆర్టీసీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. సిఎం కేసీఆర్‌ నిన్న రాత్రి డిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్‌ తిరిగి రాగానే ఉన్నతాధికారులతో ప్రగతి భవన్‌లో సమావేశమయ్యి పరిస్థితిని సమీక్షించారు. సిఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్,  ఆర్టీసీ కార్మికులకు తీవ్రస్థాయిలో హెచ్చరించారు. 

ఆర్టీసీ సంఘాలు చేస్తున్న సమ్మె చట్ట విరుద్దమని కనుక శనివారం సాయంత్రంలోగా అందరూ విధులలో చేరాలని లేకుంటే స్వచ్ఛందంగా ఉద్యోగాలు వదులుకొన్నట్లు భావించి ఉద్యోగాలలో నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. ఈసారి ఎట్టి పరిస్థితులలో వారిని మళ్ళీ ఉద్యోగాలలోకి తీసుకోబోమని హెచ్చరించారు. విధులలో చేరాలనుకునే కార్మికులకు ప్రభుత్వం పూర్తి రక్షణ, ఉద్యోగ భద్రత కల్పిస్తుందని హామీ ఇచ్చారు. కార్మికులు వారి యూనియన్ లీడర్ల మాయమాటలు నమ్మి వారి ఉచ్చులో చిక్కుకొని జీవితాలు పాడుచేసుకోవద్దని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హితవు పలికారు. 

ఆర్టీసీని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రయత్నిస్తోందని, కానీ కొందరు కార్మికులు, నేతల వలననే ఆర్టీసీ తీవ్రంగా నష్టపోతోందని ఆరోపించారు. కార్మికుల సమ్మెవలనే ఆర్టీసీకి నష్టం కలుగుతుందని అన్నారు. పొరుగు రాష్ట్రం (ఏపీ)లో వైసీపీ ప్రభుత్వం ఎన్నికలలో హామీ ఇచ్చినందునే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిందని కానీ తెరాస అటువంటి హామీ ఇవ్వలేదని, ఇవ్వని హామీని అమలుచేయాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు పట్టుబడుతుండటం సరికాదని మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. 

ఆర్టీసీ కార్మికులలో చీలికలు సృష్టిని సమ్మెను విఫలం చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈవిధంగా మాట్లాడుతోందని ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వథామరెడ్డి అన్నారు. ప్రభుత్వ హెచ్చరికలపై ఆర్టీసీ కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ఇటువంటి బెదిరింపులకు లొంగబోమని, తమ డిమాండ్లు పరిష్కారం అయ్యేవరకు సమ్మెను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.