హుజూర్‌నగర్‌ టిడిపి అభ్యర్ధిగా కిరణ్మయి

హుజూర్‌నగర్‌ టిడిపి అభ్యర్ధిగా చావా కిరణ్మయి పేరు ఖరారయింది. తెలంగాణ రాష్ట్ర టిడిపి అధ్యక్షుడు ఎల్ రమణ ఆమెకు ఆదివారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో బీఫారం అందజేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, “నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా అధినేత చంద్రబాబునాయుడుకి, రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణకి కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను. నాకు టికెట్ ఇచ్చి చంద్రబాబు నాపై చాలా పెద్ద బాధ్యత పెట్టారు. కనుక ఈ ఉప ఎన్నికలలో గెలిచి రాష్ట్రంలో టిడిపి సత్తా ఏమాత్రం తగ్గలేదని చాటి చూపుతాము,” అని అన్నారు.

హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలలో పోటీ ప్రధానంగా అధికార తెరాస, కాంగ్రెస్ పార్టీల మద్యనే సాగబోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో తెరాసకు ప్రత్యామ్నాయంగా ఎదగాలని కలలుగంటున్న బిజెపి కూడా బహుశః 3వ స్థానానికే పరిమితం కావచ్చు. కనుక ఈ ఉప ఎన్నికలలో టిడిపి 4వ స్థానానికి పరిమితంకావచ్చు.

గత ఏడాది జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికలలో స్వర్గీయ హరికృష్ణ కుమార్తె సుహాసినిని కూకట్‌పల్లి బరిలో దింపినప్పుడు చంద్రబాబునాయుడు ఆమెను బలిపశువును చేశారనే వాదన వినిపించింది. మళ్ళీ ఇప్పుడు హుజూర్‌నగర్‌లో ఉప ఎన్నికలలో టిడిపి ఓటమి అనివార్యమని తెలిసి ఉన్నప్పటికీ, చావా కిరణ్మయిని పోటీ చేయిచడాన్ని కూడా ఆవిధంగానే చూడవలసి ఉంటుంది. ఒకవేళ హుజూర్‌నగర్‌లో టిడిపి తప్పకుండ గెలిచే అవకాశాలు ఉన్నట్లయితే టికెట్ కోసం పార్టీలో సీనియర్ నేతలే పోటీ పడిఉండేవారు కదా? చావా కిరణ్మయికి ఈవిషయం తెలిసే ఉంటుంది కనుక ఓటమికి సిద్దపడే ఎన్నికలలో పోటీ చేస్తున్నారనుకోవలసి ఉంటుంది.