
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా ఉన్నప్పటికీ ఆ పార్టీ సీనియర్ నేతలు మాత్రం అసలేమీ జరగనట్లే చురుకుగా రాజకీయాలలో పాల్గొంటుంన్నారు. పార్టీ మనుగడకు అది చాలా అవసరం కూడా. కానీ పార్టీని వీడిపోతున్న నేతలను మాత్రం వారు ఆపలేకపోతున్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు అధ్యక్షుడుగా ఎన్నికైన కాంగ్రెస్ నేత మహమ్మద్ అజారుద్దీన్ తెరాసలో చేరబోతున్నారనే ఊహాగానాలు వినిపిస్తుండగానే, మరో సీనియర్ కాంగ్రెస్ నేత విజయశాంతి కూడా పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారనే ఊహాగానాలు మళ్ళీ మొదలయ్యాయి.
తాజా సమాచారం ఆమె దసరా పండుగరోజున బిజెపిలో చేరేందుకు సన్నాహాలు చేసుకొంటున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ బలహీనపడటంతో ఆమె కూడా తన రాజకీయ భవిష్యత్ గురించి ఆలోచించుకోవలసివచ్చింది. కనుక మళ్ళీ బిజెపి గూటికే చేరుకోవాలని ఆమె నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో ఇతర పార్టీలలో ప్రముఖ నేతలను బిజెపిలో చేర్చుకొని పార్టీని బలోపేతం చేసుకొని తెరాసకు ప్రత్యామ్నాయంగా ఎదగాలని రాష్ట్ర బిజెపి పెద్దలు భావిస్తున్నందున, విజయశాంతిని పార్టీలోకి రప్పించేందుకు వారు కూడా తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పుడు ఆమె కూడా సిద్దం అవడంతో ఈనెల 29న డిల్లీలో బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో విజయశాంతి కాషాయకండువా కప్పుకోబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అవి నిజమో కాదో మరో రెండు రోజులలో తెలుస్తుంది.