
సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కొంత కాలం క్రితం వరకు తరచూ ఆర్ధిక మంత్రి హరీష్‌రావుపై విమర్శలు గుప్పిస్తుండేవారు. కానీ వారం రోజుల క్రితం ఓసారి అసెంబ్లీలో హరీష్‌రావుతో భేటీ అయ్యారు. మళ్ళీ నేడు మంత్రి హరీష్‌రావు సంగారెడ్డి జిల్లా పరిషత్ సమావేశానికి వచ్చినప్పుడు ఆయనకు జగ్గారెడ్డి శాలువా కప్పి, పూల బొకేతో సన్మానం చేషారు. అది చూసి అక్కడున్న కాంగ్రెస్, తెరాస సభ్యులందరూ ఆశ్చర్యపోయారు.
హరీష్‌రావుతో గతంలో భేధాభిప్రాయాలు ఉన్నమాట వాస్తవమేనని కానీ సంగారెడ్డి నియోజకవర్గం అభివృద్ధి కోసం వాటిని పక్కనపెట్టానని జగ్గారెడ్డి చెప్పారు. అయితే జగ్గారెడ్డి తన నియోజకవర్గం అభివృద్ధి కోసమే వెనక్కు తగ్గారా లేక హరీష్‌రావుతో భేధాభిప్రాయాలు కొనసాగిస్తే తెరాసలో చేరేందుకు అవరోధంగా ఉందనే ఉద్దేశ్యంతోనే వెనక్కు తగ్గారా? అనేది రానున్న రోజులలో ఎలాగూ తెలుస్తుంది. అలాగే సంగారెడ్డి పట్టణంలో నీటి సంక్షోభానికి హరీష్‌రావే కారణమని పదేపదే ఆరోపణలు చేసిన జగ్గారెడ్డి ఇప్పుడు ఆ అభిప్రాయం మార్చుకొన్నారా? సంగారెడ్డి ప్రజల నీటి సమస్యను అటకెక్కించేయాలనుకుంటున్నారా...పరిష్కరిస్తారా? అనే సందేహాలకు కూడా కాలమే సమాధానం చెపుతుంది.