మహారాష్ట్రలో తెరాస కార్యాలయం ప్రారంభం

త్వరలో జరుగబోయే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో నిజామాబాద్‌కు సరిహద్దు జిల్లాగా ఉన్న మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో తెరాస అభ్యర్ధులను నిలబెట్టడానికి సిఎం కేసీఆర్‌ అంగీకరించిన సంగతి తెలిసిందే. దాంతో నాందేడ్ జిల్లాలో ధర్మాబాద్ మండలం సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు బాబూరావు కదం నేతృత్వంలో తెరాస అభిమానులు ధర్మాబాద్ మండలం పరిధిలోగల నల్గావ్‌లో మంగళవారం తెరాస పార్టీ కార్యాలయం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణ సిఎం కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్రంలో అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పధకాలు ఇక్కడ మాకు కూడా కావాలని కోరుకొంటున్నాము. అందుకే మేము ఇక్కడ తెరాస కార్యాలయం ప్రారంభించాము. త్వరలోనే జిల్లాలోని అన్ని శాసనసభ నియోజకవర్గాలలో తెరాస కార్యాలయాలు ప్రారంభిస్తాము. వాటి ప్రారంభోత్సవానికి నిజామాబాద్‌ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ను ఆహ్వానించబోతున్నాము. నల్గావ్‌ నియోజకవర్గం నుంచి నేను తెరాస అభ్యర్ధిగా పోటీ చేయడానికి సిద్దంగా ఉన్నాను,” అని అన్నారు.  

ఈ తాజా పరిణామాలపై తెరాస ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పందిస్తూ, “గత కొన్ని నెలలుగా నాందేడ్ నుంచి తెరాస అభిమానులు తెలంగాణ భవన్‌కు వస్తున్నారు. త్వరలో జరుగబోయే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో తమ జిల్లాలో తెరాస పోటీ చేయాలని కోరుతున్నారు. నల్గావ్‌లో తెరాస అభిమానులు అనధికారికంగా పార్టీ కార్యాలయం తెరిచినట్లు మాకు సమాచారం అందింది. వారి అభ్యర్ధనపై సిఎం కేసీఆర్‌ కూడా సానుకూలంగానే ఉన్నారు. త్వరలోనే తుది నిర్ణయం తీసుకొంటారు,” అని అన్నారు.   

నాందేడ్‌ జిల్లాలో ఆరు అసెంబ్లీ స్థానాలున్నాయి. దక్షిణ నాందేడ్‌, ఉత్తర నాందేడ్‌, భోకర్, నైగావ్, డెగ్లూర్, ముఖేడ్ నియోజకవర్గాలున్నాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు అక్టోబర్ 21న జరుగనున్నాయి. వాటిలో పోటీ చేయాలంటే అక్టోబర్ 4వ తేదీలోగా నామినేషన్లు వేయవలసి ఉంటుంది. కనుక నాందేడ్‌లో ఎన్ని స్థానాలకు తెరాస పోటీ చేయబోతోందనే విషయం సిఎం కేసీఆర్‌ ఆలోపుగా ప్రకటించవలసి ఉంటుంది.