సింగరేణికి నేడు సమ్మె పోటు

సింగరేణిలో నేడు సమ్మె జరుగుతోంది. బొగ్గు ఉత్పత్తిలో 100 శాతం విదేశీ ప్రత్యక్షపెట్టుబడులకు కేంద్రప్రభుత్వం అనుమతించడాన్ని నిరసిస్తూ నేడు దేశంలో అన్ని బొగ్గు గనులలో కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి. సాధారణంగా జాతీయస్థాయి సమ్మెలో పాల్గొనడానికి అయిష్టత వ్యక్తం చేసే తెరాస అనుబంద కార్మిక సంస్థ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్‌) కూడా ఈ సమ్మెలో పాల్గొనాలని నిర్ణయించడంతో నేడు సింగరేణిలో పూర్తిస్థాయిలో సమ్మె జరుగుతోంది. ఆ కారణంగా సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఈ ఒక్కరోజు సమ్మె వలన సింగరేణిలో 2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోతుంది. దాని వలన సుమారు రూ.73 కోట్లు నష్టం వాటిల్లనుందని సమాచారం. సింగరేణి నుంచి బొగ్గు తీసుకున్న వివిద సంస్థలు వాటి బకాయిలు చెల్లించకపోవడంతో ఇప్పటికే ఆర్ధికసమస్యలను ఎదుర్కొంటున్న సింగరేణికి ఇది ‘సమ్మె’టపోటే కానుంది.