బతుకమ్మ చీరల పంపిణీ షురూ

రాష్ట్రంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం మొదలైంది. రాష్ట్ర ఆర్ధికమంత్రి హరీష్‌రావు సోమవారం సిద్దిపేట పట్టణంలో మహిళలకు బతుకమ్మ చీరల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “తెలంగాణ సంస్కృతీ, జీవన చిత్రానికి బతుకమ్మ పండుగ అద్దం పడుతుంది. కనుక బతుకమ్మ పండుగరోజున రాష్ట్రంలో పేద మహిళలు కూడా కొత్త చీరలు కట్టుకొని ఆనందంగా పండుగ చేసుకోవాలనే సదుద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం ప్రారంభించింది. ఇంత చక్కటి సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలుచేస్తుంటే కాంగ్రెస్‌, బిజెపిలు విమర్శలు చేస్తుండటం చాలా బాధాకరం. ఎన్ని ఒడిదుకులు ఎదురైనా రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు యధాతధంగా కొనసాగుతూనే ఉంటాయి,” అని అన్నారు.