
హుజూర్‌నగర్ ఉప ఎన్నికల నగరా మ్రోగడంతో మళ్ళీ రాష్ట్రంలో రాజకీయవాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కాంగ్రెస్, తెరాస, బిజెపి నేతలు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకొంటూ అప్పుడే ఎన్నికల వాతావరణం సృష్టించేరు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం పరిధిలోని శివపల్లిలో సోమవారం కాంగ్రెస్ నేతలు పొన్నం ప్రభాకర్ , రేవంత్ రెడ్డి తదితరులు మీడియా సమావేశం ఏర్పాటుచేసి సిఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు.
పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, “సిఎం కేసీఆర్ దురహంకారం నానాటికీ పెరిగిపోతోంది. నిన్న అసెంబ్లీ సమావేశాలలో ప్రభుత్వోద్యోగులను ఉద్దేశ్యించి చాలా చులకనగా మాట్లాడిన మాటలే అందుకు తాజా ఉదాహరణ. రాష్ట్రాభివృద్ధి కోసం కష్టపడి పనిచేస్తున్న ప్రభుత్వోద్యోగులను ఉద్దేశ్యించి సిఎం కేసీఆర్ అన్నమాటలను మేము ఖండిస్తున్నాం. ప్రభుత్వోద్యోగ సంఘాలు కూడా స్పందించాల్సిందిగా కోరుతున్నాను,” అని అన్నారు.
రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, “16,000 కోట్ల మిగులు బడ్జెట్‌తో చేతికి అందిన తెలంగాణ రాష్ట్రాన్ని సిఎం కేసీఆర్ కేవలం 5 ఏళ్ళలోనే అప్పుల రాష్ట్రంగా మార్చేశారు. భవిష్యత్‌లో రాష్ట్రంలో పుట్టబోయే ప్రతీబిడ్డ తలపై లక్ష రూపాయలు అప్పులను మోపారు. ఈ విషయంలో కాగ్ కూడా రాష్ట్ర ప్రభుత్వతీరును తప్పు పట్టినప్పటికీ కేసీఆర్ మరింత బరీ తెగించినట్లు ఇంకా అప్పులు తెస్తూనే ఉంటామని శాసనసభలో గొప్పగా చెప్పారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చివేసిన సిఎం కేసీఆర్ పాలనకు హుజూర్‌నగర్ ఉప ఎన్నికలను రిఫరెండంగా భావించి ప్రజలు తీర్పునివ్వాలని కోరుతున్నాము,” అని అన్నారు.