ప్రగతి భవన్‌లో కేసీఆర్‌-జగన్ భేటీ

ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు జగన్‌మోహన్‌రెడ్డి, కేసీఆర్‌ సోమవారం సాయంత్రం ప్రగతి భవన్‌లో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో గోదావరి జలాలను శ్రీశైలం రిజర్వాయరుకు తరలింపు గురించి ప్రధానం చర్చిస్తారని సమాచారం. అలాగే గత 5 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉండిపోయిన షెడ్యూల్ 9,10లో ఆస్తులు, అప్పుల పంపకాలు, విద్యుత్ బిల్లుల బకాయిలపై కూడా చర్చిస్తారని సమాచారం. 

ఏపీలో ప్రభుత్వం మారి జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఇరువురు ముఖ్యమంత్రులు జూన్ 28న ప్రగతి భవన్‌లో ఒకసారి సమావేశమయ్యి విభజన సమస్యలను సామరస్యంగా పరిషించుకుందామని నిర్ణయించుకున్నారు. అప్పటి నుంచే విభజన సమస్యలను పరిష్కారానికి మార్గం సుగమం అయ్యింది. కనుక ఈరోజు జరుగుతున్న ఈ సమావేశంలో మరికొన్ని సమస్యలకు పరిష్కారం లభించవచ్చని ఆశించవచ్చు. ప్రస్తుతం వారి సమావేశం గంట సేపటి నుంచి కొనసాగుతోంది. మరికొద్ది సేపటిలో సమావేశం ముగిసిన తరువాత సమావేశ వివరాల గురించి అధికారిక ప్రకటన చేయవచ్చు.