
శాసనసభలో ప్రజాపద్దుల కమిటీ (పిఏసి)కి మజ్లీస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షహోదా కోల్పోవడంతో మజ్లీస్ పార్టీ ఆ స్థానం చేజిక్కించుకుంది. శాసనసభ స్పీకర్ ఆదేశం మేరకు పిఏసి ఛైర్మన్‌గా అక్బరుద్దీన్ ఓవైసీ నియమింపబడిన్నట్లు శాసనసభ కార్యదర్శి ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికలలో 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచినప్పటికీ వారిలో 12 మంది తెరాసలో విలీనమైపోవడంతో శాసనసభలో కాంగ్రెస్ బలం ఆరుకు పడిపోయింది. దాంతో 7 మంది సభ్యులున్న మజ్లీస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా, దానితోపాటు క్యాబినెట్ హోదా కలిగిన పిఏసి ఛైర్మన్ కూడా లభించాయి. మజ్లీస్ పార్టీకి ఈ హోదా దక్కడం ఇదే మొదటిసారి. ద్రవ్యవినిమయ బిల్లుకు ఆమోదం తెలిపిన తరువాత శాసనసభ నిరవడికంగా వాయిదాపడింది.