సింగరేణి కార్మికులకు శుభవార్త

సింగరేణి కార్మికులు ఎప్పుడెప్పుడాని ఎదురుచూస్తున్న ఆ శుభవార్తను సిఎం కేసీఆర్‌ నేడు శాసనసభలో ప్రకటించారు. సింగరేణి లాభాలలో ఈ ఏడాది దసరా పండుగ బోనస్‌గా 28 శాతం వాటాను ఇస్తున్నట్లు సిఎం కేసీఆర్‌ శాసనసభలో కొద్ది సేపటి క్రితం ప్రకటించారు. ఇది గత ఏడాదికంటే ఒక్క శాతం ఎక్కువ. నగదు రూపంలోనైతే  రూ.40,000 ఎక్కువ. కనుక ఈ ఏడాది సింగరేణి కార్మికులు ఒక్కొక్కరికీ కనీసం లక్ష రూపాయలు బోనస్‌గా  అందుకోబోతున్నారు. దసరా పండుగలోగా బోనస్‌ సొమ్ము కార్మికుల ఖాతాలో జమా అవుతుంది కనుక ఈ ఏడాది కూడా వారు దసరా, దీపావళి పండుగలను ఘనంగా జరుపుకోవచ్చు. 

ఈ సందర్భంగా సిఎం కేసీఆర్‌ శాసనసభలో సభ్యులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “సింగరేణిలో పనిచేసే ప్రతీ ఒక్కరూ ఎంతో నిబద్దతతో పనిచేయడం వలననే సింగరేణి లాభాల బాటలో నడుస్తోంది. కనుక వారికి లాభాలలో వాటా అందజేయడం మా భాద్యత. వారి కృషికి తగిన ఫలితం ఎప్పుడూ ఉంటుంది. ఈ స్పూర్తితో వారు సింగరేణిని మరింత అభివృద్ధిపదంలో నడిపిస్తారని ఆశిస్తున్నాను,” అని అన్నారు.