నల్లమలలో యురేనియం తవ్వకాలను అనుమతించం: కేసీఆర్‌

నల్లమల అడవులలో యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తూ సోషల్ మీడియాలో సాగుతున్న ఉద్యమంపై సిఎం కేసీఆర్‌ కూడా స్పంకించారు. సిఎం కేసీఆర్‌ శాసనసభలో మాట్లాడుతూ, “యురేనియం త్రవ్వకాల వలన అడవులు, జీవజాతులు అంతరించిపోథాయి. మన నదులు, సాగునీటి ప్రాజెక్టులు, భూమి, గాలి కలుషితమైపోతాయి. కనుక నల్లమల అడవులలో యురేనియం తవ్వకాలను తెలంగాణ ప్రభుత్వం అనుమతించబోదు. ఒకవేళ యురేనియం త్రవ్వకాలకు కేంద్రప్రభుత్వం మా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తే తీవ్రంగా వ్యతిరేకిస్తాము. అవసరమైతే కేంద్రంతో కొట్లాడతాము తప్ప యురేనియం త్రవ్వకాలకు అనుమతించేది లేదు,” అని స్పష్టం చేశారు. ఈరోజు శాసనసభలో నల్లమల అడవులలో యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తున్నట్లు ఒక తీర్మానం చేసి కేంద్రప్రభుత్వానికి పంపిస్తామని సిఎం కేసీఆర్‌ ప్రకటించగా దానికి మద్దతు ఇస్తామని కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.  

సిఎం కేసీఆర్‌ చేసిన ఈ ప్రకటనపై సేవ్ నల్లమల పేరుతో ఉద్యమిస్తున్న ఆందోళనకారులు హర్షం వ్యక్తం చేశారు. కానీ ఇప్పటికే నల్లమలలో యురేనియం కోసం సర్వే చేస్తున్న బృందాలను వెనక్కు తిప్పి పంపించాలని, యురేనియం ఆన్వేషణ కోసం వారు వేసిన బోర్లను పూడ్చివేయాలని, “ఈ అడవిలో యురేనియం త్రవ్వకాలకు అనుమతి లేదు,” అనే బోర్డులను ఏర్పాటు చేయాలని కోరారు.