
పాపికొండల విహారయాత్రలో పెను విషాదం చోటు చేసుకుంది. ఆదివారం మధ్యాహ్నం తూర్పు గోదావరి జిల్లాలోని కచ్చులూరు వద్ద ఒక టూరిస్ట్ బోటు మునిగిపోయింది. ప్రమాద సమయంలో దానిలో 71 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. వారిలో 37మంది గల్లంతు కాగా, 27మంది ప్రాణాలతో బయటపడ్డారు. సహాయ బృందాలు ఇప్పటి వరకు 12 మృతదేహాలను వెలికితీసాయి. ఈ ప్రమాదంలో మృతి చెందిన, గల్లంతైనవారిలో వరంగల్, హైదరాబాద్‌కు చెందినవారే ఎక్కువ మంది ఉన్నారు. పాపికొండలు అందాలు చూసేందుకు వారందరూ పోలవరం నుంచి రాయల్ వశిష్ట అనే టూరిస్ట్ బోటులో బయలుదేరారు.
గోదావరి వరద ఉదృతి ఎక్కువగా ఉన్నందున గత కొన్ని రోజులుగా పర్యాటకబోట్లను నిలిపివేశారు. రాయల వశిష్ట బోటును కూడా పోలీసులు దేవీపట్నం వద్ద నిలిపివేశారు. కానీ తాము పోలవరం పోలీసుల అనుమతి తీసుకునే బయలుదేరామని బోటు నిర్వాహకులు గట్టిగా చెప్పడంతో విడిచిపెట్టారు. అందరూ లైఫ్ జాకెట్లు వేసుకోవాలని పోలీసులు హెచ్చరించి బోటును విడిచిపెట్టారు. పోలీసుల సూచన మేరకు అందరూ లైఫ్ జాకెట్లు వేసుకున్నారు. కానీ బోటు బయలుదేరగానే చాలామంది వాటిని విప్పేశారు.
మధ్యాహ్నం 1.45 గంటలకు బోటు కచ్చులూరు వద్ద మందం అనే ప్రాంతానికి చేరుకుంది. అక్కడ కొండ మలుపు ఉన్నందున గోదావరి ఉదృతి ఎక్కువగా ఉంటుంది. ఆ కారణంగా ఆ ప్రాంతంలో సుడిగుండాలు ఏర్పడుతుంటాయి. వాటిలో చిక్కుకుంటే బయటపడటం చాలా కష్టం కనుక సాధారణంగా పర్యాటక బోట్లు అటువైపు వెళ్లకుండా పశ్చిమ గోదావరి జిల్లా తీరం వైపు నుంచి ముందుకు సాగుతుంటాయి. కానీ ప్రమాదామని తెలిసీ బోటు డ్రైవర్ బోటును అటువైపే తీసుకువెళ్ళాడు. అక్కడ నీటి ఉదృతి ఎక్కువగా ఉండటంతో బోటును అదుపు చేయడానికి బోటు డ్రైవర్ ఇంజన్లను రైజ్ చేయడంతో బోటు అదుపుతప్పి మునిగిపోయింది. ఆ కుడుపులకు బోటు పైఅంతస్తులో ఉన్న కొందరు నదిలో పడిపోగా, క్రింది అంతస్తులో భోజనాలకు సిద్దం అవుతున్నవారు బోటు మునిగిపోవడంతో జలసమాధి అయ్యారు. చనిపోయినవారిలో చిన్న పిల్లలు మొదలు వృద్ధులవరకు అన్ని వయసుల వారూ ఉన్నారు.
ప్రమాదం జరిగినప్పుడు లైఫ్ జాకెట్స్ వేసుకున్నవారందరూ ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదం గురించి తెలుసుకున్న స్థానికులు వెంటనే బోట్లలో ఆ ప్రాంతానికి వెళ్ళి కొంతమందిని కాపాడి ఒడ్డుకు చేర్చారు. ఈ ప్రమాదం గురించి తెలియగానే జిల్లా అధికారులు, పోలీసులు, సహాయ సిబ్బంది అక్కడకు చేరుకొని సహాయచర్యలు చేపట్టారు.
నేవీ హెలికాఫ్టర్లు, నేవీ బోట్లలో నేవీ సిబ్బంది, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు, అగ్నిమాపకశాఖకు చెందిన బృందాలు అక్కడకు చేరుకొని గాలింపు చర్యలు మొదలుపెట్టారు. నిన్న సాయంత్రం నుంచి ఈరోజు ఉదయం వరకు నిరంతరంగా గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.
బోటు క్రింది అంతస్తులో తలుపులు, కిటీకీలు కలిగిన పెద్ద హాల్ వంటి గదిలో ఎక్కువ మంది యాత్రికులు ఉన్నారు. వారిలో మహిళలు, వృద్ధులు, చిన్నారులు కూడా ఉన్నారు. బోటు మునిగినప్పుడు ఆ గదిలో నుంచి వారు తప్పించుకొని బయటపడే అవకాశాలు చాలా తక్కువ. కనుక వారు దానిలోనే జల సమాధి అయ్యుండవచ్చు. బోటును బయటకు తీస్తేకానీ దానిలో ఎంతమంది చిక్కుకున్నారో తెలియదు.
ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల అధికారులు, పోలీసులు, సహాయ బృందాలు నిన్న రాత్రి నుంచి గోదావరి ఒడ్డున మకాం వేసి గాలింపు, సహాయచర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రమాదంలో చనిపోయినవారి శవాలను పోలీసులు రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రాణాలతో బయటపడినవారికి రంపచోడవరం ఏరియా అసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేసిన తరువాత రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.