కేటీఆర్‌ మంచి మాట చెప్పారు...వింటారా?

తెరాసలో ప్రకంపనలు పుట్టిస్తున్న గులాబీ జెండా ఓనర్ల వ్యవహారంపై తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఘాటుగా స్పందించారు. బుదవారం తెలంగాణ భవన్‌లో పార్టీ నేతలు, కార్యదర్శుల సమావేశంలో మాట్లాడుతూ, “కొంతమంది నేతలు పార్టీ క్రమశిక్షణ తప్పి మీడియా ముందుకు వచ్చి ‘పార్టీ యజమానులం అంటూ’ ఏవేవో మాట్లాడుతున్నారు. తెరాస 4 కోట్ల మంది ప్రజల అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి ప్రతీక వంటి ఒక ప్రజావ్యవస్థ. ఎక్కడైనా ఆస్తులకు యజమానులు ఉంటారు కానీ ఇటువంటి వ్యవస్థలకు ఉండరని అందరూ గ్రహించాలి. పార్టీ క్రమశిక్షణను అతిక్రమించడంటే డెంగీ వ్యాధికంటే ప్రమాదకరమైనది. కనుక ఎవరూ క్రమశిక్షణను అతిక్రమించవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకవేళ ఎవరైనా క్రమశిక్షణను అతిక్రమించి మాట్లాడినా...వ్యవహరించినా వారిపై కటినచర్యలు ఉంటాయి.

ఇంకా అనేక వందల పదవులు భర్తీ చేయవలసి ఉంది కనుక మంత్రిపదవులు లభించలేదని ఎవరూ బాధపడక్కరలేదు. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న ప్రతీ ఒక్కరికీ తప్పకుండా సముచిత గౌరవం, స్థానం లభిస్తాయి. కనుక తొందరపడి ఎవరూ నోరుజారవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. పార్టీకి నష్టం కలిగించే మాటలు ఎవరు మాట్లాడుతున్నా కార్యకర్తలు వారిని నిలదీయాలి. రాష్ట్రాభివృద్ధికి, ప్రజాసంక్షేమానికి మనం నిబద్దతతో కృషి చేస్తున్నామని ప్రజలు నమ్మినందునే మనకు మళ్ళీ అధికారం కట్టబెట్టారు. కనుక పదవుల కోసం బజారుకెక్కి ప్రజల ముందు మీరు చులకన కావద్దు. మన ప్రభుత్వాన్ని చులకన చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.