బాధగానే ఉంది కానీ...జోగు రామన్న

మంత్రి పదవి లభించనందుకు అలిగి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన తెరాస ఎమ్మెల్యే జోగు రామన్న బుదవారం మళ్ళీ మీడియా ముందుకు వచ్చారు. ఆదిలాబాద్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, “నేను అజ్ఞాతంలోకి వెళ్ళినట్లు వస్తున్న వార్తలు నిజం కాదు. హటాత్తుగా బీపీ పెరిగిపోవడంతో నేను హైదరాబాద్‌లోని ఒక ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నాను. వైద్యుల సలహా మేరకు ఎవరితో మాట్లాడకుండా ఉండేందుకే ఫోన్ స్విచాఫ్ చేశాను తప్ప వేరే ఉద్దేశ్యంతో కాదు. జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు ఎంతగానో పనిచేసినందున నాకు తప్పకుండా మంత్రిపదవి వస్తుందని ఆశించాను. కానీ రాలేదు. మంత్రిపదవి లభిస్తుందని చాలా కాలంగా భరోసా ఇస్తున్నందునే నేను ఆశపెట్టుకున్నాను కానీ చివరి నిమిషంలో నాకు మంత్రి పదవి ఇవ్వడం లేదని తెలిసి చాలా బాధపడ్డాను. నేనే కాదు... పార్టీ కార్యకర్తలు కూడా చాలా బాధపడుతున్నారు. కానీ  ఏం చేస్తాం? బాధ భరించక తప్పదు. మంత్రిపదవి ఇవ్వనందున నేను పార్టీని వీడాలనుకోవడం లేదు. కేసీఆర్‌ నాయకత్వంలోనే పనిచేస్తాను. కేసీఆరే మా నాయకుడు,” అని జోగు రామన్న అన్నారు. 

ఈ సందర్భంగా జోగు రామన్న తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఒకానొక దశలో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆయన కన్నీళ్లు పెట్టుకోవడం చూసి ఆయన అనుచరులు తీవ్ర ఉద్వేగానికిలోనయ్యారు. తను అజ్ఞాతంలోకి వెళ్ళిన్నప్పుడు తన ఇంటి వద్ద ఒక కార్యకర్త ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలుసుకున్న జోగు రామన్న ఇకపై ఎవరూ ఆటువంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. 

మంత్రిపదవి లభించనందుకు అలిగినవారిలో జోగు రామన్న, రాజయ్య, మైనంపాటి బుజ్జగింపులతో మెత్తబడ్డారు. కానీ తెరాసలో చాలామంది ఇంకా అలకపాన్పుపైనే ఉన్నారు. వారినీ బుజ్జగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోపక్క తెరాసలోని ఇటువంటి అసంతృప్తనేతలను బిజెపిలోకి ఆకర్షించేందుకు ఆ పార్టీ నేతలు తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నారు. కనుక ఈ అలకలు-బుజ్జగింపుల సన్నివేశాలు పూర్తయ్యేసరికి ఎంతమంది తెరాస నేతలు బిజెపిలో చేరుతారో చూడాలి.