
మంత్రి పదవి ఆశించి భంగపడిన ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అలకపాన్పు ఎక్కారు. సోమవారం జరిగిన శాసనసభ సమావేశానికి ఆయన హాజరుకాలేదు. సోమవారం ఉదయమే తన ఎమ్మెల్యే క్వార్టర్స్ ఖాళీ చేసి, గన్‌మెన్‌లను విడిచిపెట్టి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేయడంతో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నిన్నటి నుంచి ఆయన ఎక్కడకు వెళ్ళారో తెలియలేదు.
ఆయన ఇంటి వద్ద నిన్న ఆయన అనుచరులు రెండు గ్రూపులుగా విడిపోయి ఘర్షణ పడినట్లు తెలుస్తోంది. ‘మీ వైఖరి కారణంగానే రామన్నకు మంత్రిపదవి రాలేదంటూ’ పరస్పరం నిందించుకున్నారు. దాంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో పోలీసులు వచ్చి వారిని చెదరగొట్టినట్లు తెలుస్తోంది.
జోగు రామన్న గత ప్రభుత్వంలో మంత్రిగా పని చేసినందున ఈసారి కూడా తప్పకుండా మంత్రివర్గంలోకి తీసుకొంటారని ఆశించారు. కానీ రాజకీయ అవసరాలు, జిల్లా, కుల సమీకరణాలు వగైరాల కారణంగా ఈసారి ఆయనకు అవకాశం లభించలేదు. తెరాసలో ఈవిధంగా తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న నేతలు చాలా మందే ఉన్నారు. వారందరికీ వేరే పదవులిచ్చి సర్దిచెప్పే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కనుక జోగు రామన్నకు కూడా ఏదో ఓ పదవి లభిస్తే అలకపాన్పు దిగవచ్చు.