
పవిత్ర యాదాద్రి పుణ్యక్షేత్రంలో కొత్తగా నిర్మితమవుతున్న అష్టబుజి ప్రకార మండపంలో రాతి స్తంభాలపై సిఎం కేసీఆర్, తెరాస పార్టీ చిహ్నం..కారు బొమ్మలను చెక్కడాన్ని బిజెపి నేతలు ఖండిస్తూ సిఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు.
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “యాదాద్రి ఆలయంలో కేసీఆర్, కాంగ్రెస్ నేతల బొమ్మలను, కారు బొమ్మను చెక్కడం ఆలయ పవిత్రతను దెబ్బతీస్తోంది. దేవాలయాలలో దేవాతామూర్తుల విగ్రహాలు తప్ప సాధారణమానవుల విగ్రహాలు చెక్కిన దాఖలాలు లేవు. కాంగ్రెస్ నేతలు అభ్యంతరం చెప్పకుండా ఉండేందుకే కేసీఆర్ తన బొమ్మతో పాటు నెహ్రూ, ఇందిరాగాంధీ బొమ్మలను చెక్కించినట్లున్నారు. అలాగే మజ్లీస్ నేతలను తృప్తి పరిచేందుకు ఛార్మినార్ బొమ్మను చెక్కించారని అర్ధమవుతోంది. పవిత్రమైన హిందూ దేవాలయంలో మానవవుల బొమ్మలు, ఇతర మతాలను సూచించే బొమ్మలను చెక్కడం చాలా దారుణం...అపచారం. ఇందుకు సిఎం కేసీఆర్ హిందువులకు క్షమాపణలు చెప్పి తక్షణం ఆ బొమ్మలను తొలగించాలి. దీనివలన యాదాద్రిలో జరుగరానిది ఏదైనా జరిగితే అందుకు కేసీఆరే బాధ్యత వహించాలి,” అని అన్నారు.
కేసీఆర్ చర్యలను ఖండిస్తూ జిల్లా బిజెపి కార్యకర్తలు శుక్రవారం యాదాద్రి కొండదిగువన ధర్నా చేశారు. ఆధ్యాత్మిక అంశాలకు ఉపయోగించవలసిన యాదాద్రి ఆలయంలో తెరాస ప్రచారానికి వాడుకోవడం దుర్మార్గమని అన్నారు. తక్షణం కేసీఆర్, కారు బొమ్మలను తొలగించి, ప్రజలకు క్షమాపణ చెప్పాలని లేకుంటే ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు.