
తెలంగాణలో టిడిపిలో ఇవాళ్ళ మరో వికెట్ పడింది. సీనియర్ నేత రేవూరి ప్రకాష్ రెడ్డి డిల్లీలో బిజెపి వర్కింగ్ ప్రెసిడెంట్ జెపి నడ్డా, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కె.లక్ష్మణ్ తదితరుల సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణ అభివృద్ధి కోసం పాటుపడిన పార్టీ టిడిపియేనానడంలో ఎటువంటి సందేహమూ లేదు. కానీ మంచి వాక్చాతుర్యం ఉన్న సిఎం కేసీఆర్ టిడిపిపై ఆంధ్రాపార్టీ అనే ముద్రవేసి రాజకీయంగా దెబ్బ తీశారు. తెలంగాణ రాష్ట్రంలో టిడిపి బలహీనపడినందున, తెరాసను ఎదుర్కోగల శక్తి బిజెపికి మాత్రమే ఉందని నమ్మి ఈరోజు బిజెపిలో చేరాను. అయితే నా రాజకీయ ఎదుగుదలకు కారణమైన టిడిపి, చంద్రబాబునాయుడు అంటే ఇప్పటికీ చాలా గౌరవం ఉంది. చంద్రబాబునాయుడే తెలంగాణ టిడిపి నేతలను బిజెపిలో చేరాలని ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలను నేను ఖండిస్తున్నాను. ప్రధాని నరేంద్రమోడీ సుపరిపాలన, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకునే నేను బిజెపిలో చేరుతున్నాను,” అని చెప్పారు.