8.jpg)
రాష్ట్రంలో అన్ని గ్రామాలలో పచ్చదనం, పరిశుభ్రతను పెంచేందుకు సిఎం కేసీఆర్ 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక ప్రకటించారు. దీని గురించి అధికారులకు మార్గదర్శనం చేయడం కోసం మంగళవారం సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా సిఎం కేసీఆర్ వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “రాష్ట్రంలో అన్ని గ్రామాలు పచ్చదనం, పరిశుభ్రంగా ఉండాలనే ఉద్దేశ్యంతో పంచాయతీరాజ్ శాఖలో ఖాళీలను భర్తీ చేసి, బారీగా నిధులు విడుదల చేస్తోంది. గ్రామాలలో సఫాయి కార్మికులకు జీతాలు పెంచాము. కానీ కేవలం వీటితోనే గ్రామాలలో మార్పు సాధ్యం కాదు. కనుక జిల్లా కలెక్టర్ల మొదలు గ్రామ సర్పంచ్ల వరకు అందరూ చొరవ తీసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాను. ప్రజల భాగస్వామ్యం లేకుండా ఏ కార్యక్రమం విజయవంతం కాదు కనుక దీనిలో ప్రజలను కూడా భాగస్వాములుగా చేసేందుకు అధికారులు ప్రోత్సహించాలని కోరుతున్నాను.
ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు, గ్రామ పంచాయితీలకు ఈ పనులకు అవసరమైన నిధులు, సిబ్బందిని అందుబాటులో ఉంచాము. ప్రభుత్వపరంగా నేను నా బాధ్యత పూర్తి చేసిన తరువాతే మీ అందరికీ ఈ పని అప్పజెపుతున్నాను. కనుక ప్రజలకు మేలు చేసి, రాష్ట్రానికి మంచిపేరు తెచ్చిపెట్టే ఈ కార్యక్రమంలో మీరు కూడా అంతే నిబద్దతతో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాను. గ్రామాలలో ప్రజలు ఈ దసరా పండుగను పరిశుభ్రమైన వాతావరణంలో జరుపుకోవాలని కోరుతున్నాను. రాబోయే 30 రోజులలో మన పల్లెలలో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడాలి. మన తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే దేశానికి ఆదర్శంగా నిలిచింది. ఇప్పుడు మన పల్లెలు కూడా ఆదర్శంగా నిలవాలి. ఈ కార్యక్రమంలో మంచి ఫలితాలు కనబరించిన వారందరికీ ప్రోత్సాహకాలు, నిర్లక్ష్యంగా వ్యవహరించినవారిపై కటిన చర్యలు ఉంటాయి. కనుక ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, ప్రజలు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాను,” అని చెప్పారు.