
తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా తమిళసై సౌందర్ రాజన్ గవర్నర్గా నియమితులవడంతో సుమారు తొమ్మిదన్నరేళ్ళపాటు ఉభయరాష్ట్రాలకు సేవలందించిన నరసింహన్ తప్పుకోనున్నారు. ఈ సందర్భంగా సిఎం కేసీఆర్ ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి తన పరిపాలనకు ఎంతగానో సహకరించినందుకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కటువుగా వ్యవహరించినప్పటికీ, రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ ప్రభుత్వానికి చాలా సహకరించారు. గవర్నర్ నరసింహన్ అందించిన తోడ్పాటుతోనే తమ ప్రభుత్వం రాష్ట్రంలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేయగలిగిందని సిఎం కేసీఆర్ ప్రశంసించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు, ఆ తరువాత రాష్ట్ర పునర్నిర్మాణ కీలక దశలలో వెన్నంటి ఉన్న గవర్నర్ నరసింహన్ వెళ్ళిపోతుండటం చాలా బాధ కలిగిస్తోందని సిం అన్నారు. గవర్నర్ దంపతులు పూర్తి ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకొంటున్నానని సిఎం కేసీఆర్ అన్నారు. ఒకటి రెండురోజులలోనే గవర్నర్ దంపతులను రాష్ట్ర ప్రభుత్వం తరపున సిఎం కేసీఆర్ ఘనంగా సన్మానించి వీడ్కోలు పలుకనున్నారు.
గవర్నర్ నరసింహన్ కూడా సిఎం కేసీఆర్ ఆలోచనలను, విధానాలను మెచ్చుకున్నారు. రాష్ట్రాభివృద్ధికి, ప్రజా సంక్షేమం కోసం కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన పధకాలను ప్రశంసించారు. తన పదవీకాలం చాలా సంతృప్తిగా ముగిసిందని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు మరింత అభివృద్ధి సాధించాలని నరసింహన్ ఆకాంక్షించారు.
తెలంగాణ గవర్నర్గా నియమితులైన తమిళసై సౌందరరాజన్ త్వరలోనే హైదరాబాద్ వచ్చి బాధ్యతలు చేపట్టనున్నారు.