ఈటల ఇంటికి జనాలు క్యూ!

మొన్న గురువారం తెరాస కార్యకర్తల సమావేశంలో మంత్రి ఈటల రాజేందర్‌ ‘గులాబీ జెండా యజమానులం... మంత్రి పదవి ఎవరో పెట్టిన భిక్ష కాదు...” అంటూ సంచలన వ్యాఖ్యలు చేసినప్పటి నుంచి ఆయన ఇంటికి బారీగా జనాలు తరలిరావడం మొదలైంది. మేడ్చల్‌లోని ఆయన నివాసానికి అనుచరులు, మహిళా సంఘాలు, బీసీ సంఘాల నేతలు తరలివస్తున్నారు. వారిలో కొందరు ‘ఈటల రాజేందర్‌ నాయకత్వం వర్ధిల్లాలి...’ అంటూ నినాదాలు చేసినప్పుడు ఆయన వారిని వారించారు. తొందరపడి ఎవరూ ఎటువంటి వ్యాఖ్యలు చేయరాదని సూచించారు. అయితే విలేఖరులతో ఈ అంశం గురించి మాట్లాడేందుకు ఈటల నిరాకరించినట్లు తెలుస్తోంది.

శుక్రవారం మధ్యాహ్నం తెరాస నుంచి ఒక ముఖ్యనేత ఈటల రాజేందర్‌తో ఏకాంతంగా మాట్లాడివెళ్ళినట్లు తెలుస్తోంది కానీ వారు దేని గురించి మాట్లాడుకున్నారనే విషయం తెలియదు. ఈటల ఇంటి దగ్గర జరుగుతున్న హడావుడి చూస్తుంటే త్వరలో ఏదో జరుగబోతోందనే అనుమానం కలుగుతోంది. అయితే వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న ఆయనను కలిసేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి రోజూ చాలామంది ప్రజలు వస్తుంటారని ఈటల అనుచరులు తెలిపారు.