కేసీఆర్‌కు పాలాభిషేకం చేయక తప్పదు

మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆదివారం రంగారెడ్డి జిల్లాలోని లక్ష్మీదేవిపల్లిలో బారీ బహిరంగసభ నిర్వహించనున్నారు. జిల్లాలో పొలాలకు గోదావరి నీళ్ళు అందించాలనే డిమాండ్‌తో ఈ సభను నిర్వహించబోతున్నట్లు చెప్పారు. గతంలో సిఎం కేసీఆర్‌ లక్ష్మీదేవిపల్లికి నీళ్ళు అందిస్తానని మూడుసార్లు చెప్పారని కనుక శంకరపల్లిలోని కొండపోచమ్మసాగర్‌ నుంచి లక్ష్మీదేవిపల్లికి నీళ్ళు అందించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ సిఎం కేసీఆర్‌ వచ్చే ఖరీఫ్ సీజనులోగా రంగారెడ్డిజిల్లాకు సాగునీరు అందించినట్లయితే ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేస్తానని ప్రకటించారు.

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం కోసం సిఎం కేసీఆర్‌ ఇప్పటికే కార్యాచరణ ప్రకటించారు. నిధుల సమీకరణ, లభ్యత, బిల్లుల చెల్లింపులు తదితర అంశాలలో అధికారులకు, కాంట్రాక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయసహకారాలు అందజేస్తుందని, కనుక వచ్చే ఖరీఫ్ సీజన్‌కు నీటిని అందించడమే లక్ష్యంగా పెట్టుకొని పనులు పూర్తి చేయాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లాగే రోజుకు మూడు షిఫ్టులలో పనిచేసేందుకు అవసరమైన ఏర్పాట్లను చేసుకోవాలని చెప్పారు. ఇకపై నెలకు ఒకటి రెండుసార్లు ప్రాజెక్టు పనుల పరిశీలనకు వస్తుంటానని చెప్పారు. మూడేళ్లలో కాళేశ్వరం వంటి బారీ ప్రాజెక్టును పూర్తిచేసి చూపించిన సిఎం కేసీఆర్‌, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును కూడా పూర్తిచేసి చూపించడం ఖాయం. కనుక కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేయడానికి కొండా విశ్వేశ్వర్ రెడ్డి పాలు సిద్దం చేసుకుంటే మంచిది.