
సినీహీరోలు రాజకీయాలలో ప్రవేశించడం చాలాకాలంగా జరుగుతున్నదే. ముందుతరం హీరోలు రాష్ట్రాలను రాజకీయాలను శాశించగలిగారు కానీ ఇప్పటితరం హీరోలు మాత్రం రాజకీయాలపై పట్టు సాధించలేక మళ్ళీ సినీపరిశ్రమకు తిరిగివస్తున్నారు.
అయితే ప్రస్తుతం ఏపీలో పవన్ కల్యాణ్, తమిళనాడులో కమల్ హాసన్ మాత్రం ఎదురుదెబ్బలు తింటున్నా తట్టుకొంటూ రాజకీయాలలోనే కొనసాగుతున్నారు. లోక్‌సభ ఎన్నికలలో కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) పార్టీ ఘోరపరాజయం పాలైనప్పటికీ ఏమాత్రం నిరాశ చెందకుండా త్వరలో జరుగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దం అవుతుండటం విశేషం.
ఇప్పుడు రాజకీయ పార్టీలకు సైతం మీడియా దన్ను, ప్రచారం చాలా అవసరంగా మారిపోయింది కనుక కమల్ హాసన్ తన పార్టీ కోసం ఒక తమిళ్ న్యూస్ ఛానల్‌ను నవంబర్ 7న తన పుట్టినరోజునాడు ప్రారంభించడానికి చురుకుగా ఏర్పాట్లు చేసుకొంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఛానల్ ఏర్పాటు కోసం కేంద్రానికి దరఖాస్తు కూడా చేసుకున్నారు.
2021లో జరుగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం ఈ ఏడాది నవంబర్ 7 నుంచే ఎన్నికల ప్రచారం ప్రారంభించడానికి కమల్ హాసన్ సన్నాహాలు చేసుకొంటున్నారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికలలో గెలిచి అధికారం చేజిక్కించుకోవాలని పట్టుదలతో ఉన్న కమల్ హాసన్, ఎన్నికల వ్యూహనిపుణుడు ప్రశాంత్ కిషోర్ బృందం సేవలను వినియోగించుకోబోతున్నారు.
పవన్ కల్యాణ్, కమల్ హాసన్ ఒకే బాటలోనే నడుస్తున్నారు కనుక పవన్ కల్యాణ్ కూడా టీవీ ఛానల్ ప్రారంభిస్తారేమో? రాజకీయాలలో ఓటమి ఎదురవగానే పార్టీని వేరే పార్టీలో విలీనం చేసి మళ్ళీ సినిమాలు చేసుకోవాలనే ఆలోచన చేయకుండా, ఓటమి నుంచి పాఠాలు నేర్చుకొని పట్టుదలగా ముందుకు సాగుతున్న కమల్, పవన్‌లను అభినందించవలసిందే.