
మిడ్‌మానేరు జలాశయంలో ముంపుకు గురైన కందికట్కూర్ నిర్వాసితులు నష్టపరిహారం కోరుతూ గత రెండు రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. ఈరోజు వారి ఆందోళనలో పాలుపంచుకున్న బిజెపి ఎంపీ బండి సంజయ్ కుమార్, సిఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. “సిఎం కేసీఆర్ చింతమడక గ్రామస్తులు అడగకుండానే ఇంటికి పది లక్షలు చొప్పున ఆర్ధికసాయం ప్రకటించారు. కానీ మిడ్‌మానేరు జాలాశయం క్రింద ముంపుకు గురైన కందికట్కూర్ నిర్వాసితులు పరిహారం కోరుతూ ఆందోళన చేస్తున్నా కేసీఆర్ పట్టించుకోవడం లేదు. నిర్వాసితులు ఎమ్మెల్యేలు పాపం చేశారని సిఎం కేసీఆర్ వారిపట్ల అంత కటినంగా వ్యవహరిస్తున్నారు? ఈసారి సిఎం కేసీఆర్ మిడ్‌మానేరు సందర్శనకు వచ్చేలోగా నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలి లేకుంటే వారితో కలిసి ఉద్యమం చేపడతాము. అవసరమైతే ప్రగతి భవన్ ముట్టడిస్తాము,” అని అన్నారు.
‘గులాబీ జెండాకి మేమే యజమానులం’ అన్న మంత్రి ఈటల రాజేందర్ మాటలపై స్పందిస్తూ తెరాసలో ‘ఓనర్షిప్ హక్కుల’ సమస్య మొదలైందని అన్నారు. మిడ్‌మానేరు నిర్వాసితులకు న్యాయం చేస్తానన్న ఈటల రాజేందర్ ఆ హామీని నిలబెట్టుకోవాలని లేకుంటే వారి తరపున ప్రభుత్వంతో పోరాడేందుకు పార్టీకి, మంత్రి పదవికి రాజీనామా చేసి బయటకు రావాలని బండి సంజయ్ అన్నారు. ఈటల రాజేందర్ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళ నిర్మాణం కోసం ప్రతిపాదనలు చేసి అందిస్తే కేంద్రప్రభుత్వంతో మాట్లాడి వాటిని మంజూరు చేయించుకొచ్చే బాధ్యత తీసుకొంటానని బండి సంజయ్ అన్నారు.