
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అమలుచేస్తున్న అనేకానేక అభివృద్ధి, సంక్షేమ పధకాలకు, విధానాలకు జాతీయ, అంతర్జాతీయస్థాయిలో ప్రశంసలు, అవార్డులు అందుకొంటూనే ఉంది. తాజాగా తెలంగాణ పౌరసరఫరాలశాఖకు ప్రతిష్టాత్మకమైన స్కోచ్ జాతీయ అవార్డు లభించింది.
రేషన్ సరుకుల సేకరణ మొదలు రవాణా, సరఫరా, నిఘా, బిల్లింగ్ వరకు అడుగడుగునా పకడ్బందీగా అమలుచేసేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకొంటూ అత్యంత సమర్ధంగా, అత్యంత పారదర్శకంగా పౌరసరఫరా సేవలను నిర్వహిస్తున్నందుకు ఈ అవార్డు లభించింది.
రేషన్ సరుకుల సేకరణ, నియంత్రణ కోసం పౌరసరఫారాల శాఖ ఆన్‌లైన్ ప్రొక్యూర్మెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ విధానాన్ని అమలుచేస్తోంది. అలాగే టి-రేషన్, టి-వాలెట్ వంటి యాప్స్ ను విరివిగా వినియోగిస్తోంది. డిల్లీలో జరిగిన స్కోచ్ అవార్డుల కార్యక్రమంలో రాష్ట్ర పౌరసరఫరా సంస్థ జనరల్ మేనేజర్ (మార్కెటింగ్) నాగేందర్ రెడ్డి స్కోచ్ అధినేత పన్నీర్ కొచ్చర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం పనితీరును, దాని విధానాలను నిత్యం విమర్శిస్తున్న కాంగ్రెస్, బిజెపి నేతలు మరి దీనిని చూశారో లేదో?రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని, సంక్షేమ పధకాలను గుర్తించకపోయినా పరువలేదు కానీ జాతీయస్థాయిలో రాష్ట్రానికి ఒక ప్రత్యేక గుర్తింపు, గౌరవం లభించినప్పుడు దాని గురించి ప్రతిపక్ష నేతలు ఒక మాట అంటే ప్రజలు కూడా సంతోషిస్తారు కదా!