రేవంత్‌కు విద్యుత్, ఉత్తమ్‌కు సాగునీరు శాఖలు!

అవును. కాంగ్రెస్‌ ఎంపీలు రేవంత్‌ రెడ్డికి సాగునీటి శాఖ, ఉత్తమ్ కుమార్ రెడ్డికి విద్యుత్ శాఖ బాధ్యతలు కేటాయించబడ్డాయి. ఈవిషయం రేవంత్‌ రెడ్డి స్వయంగా ఈరోజు మీడియాకు తెలిపారు. సీఎల్పీ నేతకు భూకేటాయింపుల బాధ్యత ఇచ్చినట్లు తెలిపారు. అయితే కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు కదా? మరి వారు ముగ్గురికీ మంత్రిపదవులు ఏవిధంగా లభించాయి? అనే అనుమానం కలుగవచ్చు. వాటికి రేవంత్‌ రెడ్డి సమాధానం చెప్పారు. 

సిఎం కేసీఆర్‌ ప్రభుత్వంలో సాగునీటి శాఖలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను కనుగొని బయటపెట్టే బాధ్యతను ఉత్తమ్ కుమార్ రెడ్డికి, భూకేటాయింపుల అక్రమాలను బయటపెట్టే బాధ్యతను మల్లు భట్టి విక్రమార్కకు, విద్యుత్ కొనుగోళ్ళలో జరిగిన అవినీతిని, అక్రమాలను బయటపెట్టె బాధ్యతను తనకూ  తెలంగాణ కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్-ఛార్జ్ రాంచంద్ర కుంతియా అప్పగించారని రేవంత్‌ రెడ్డి స్వయంగా చెప్పారు. 

కనుక తనకు లభించిన శాఖపై సమాచారం సేకరించిన రేవంత్‌ రెడ్డి, గురువారం మీడియా సమక్షంలో తెరాస సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు. విద్యుత్ కొనుగోళ్ళలో సిఎం కేసీఆర్‌ తప్పుడు నిర్ణయాల వలన 2016-17లో రాష్ట్ర ప్రభుత్వానికి సుమారు రూ. 1,000 కోట్లు నష్టం వచ్చిందని ఆరోపించారు. కొన్ని సంస్థలకు లబ్ధి కలిగించడం ద్వారా వాటి నుంచి ముడుపులు తీసుకొన్నారని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. విద్యుత్ శాఖలో అపార అనుభవం ఉన్న ప్రభాకర్ రావును అడ్డం పెట్టుకొని సిఎం కేసీఆర్‌ చాలా తెలివిగా కమీషన్లు పోగేసుకున్నారని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. ఇంకా ఇండియా బుల్స్ నుంచి పనికిరాని యంత్రాలను, అవసరం లేకున్నా అధనపు విద్యుత్ కొనుగోళ్ళు చేసి రాష్ట్ర ఖజానాకు తీరని నష్టం కలిగించారని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. 

రేవంత్‌ రెడ్డి తరువాత సాగునీరు, భూకేటాయింపుల శాఖల బాధ్యత తీసుకున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క కూడా త్వరలోనే విధులలో చేరే అవకాశం ఉంది.