ప్రజలకు బిస్లరీ...బీర్ల కంపెనీలకు సింగూరు నీళ్ళా? బిజెపి

సిఎం కేసీఆర్‌ ప్రభుత్వ విధానాలపై రాష్ట్ర బిజెపి నేత రఘునందన్ రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. సంగారెడ్డి పట్టణంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ, “సంగారెడ్డి ప్రజలు నీళ్ళు లేక అల్లాడుతుంటే ప్రభుత్వం సింగూరు జాలలను తరలించుకుపోయి బీర్ల కంపెనీలకు అందిస్తోంది. దాంతో ప్రజలు రోజూ బిస్లరీ బాటిల్స్ కొనుకొని దాహం తీర్చుకోవలసివస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే లక్షల ఉద్యోగాలు వస్తాయని సిఎం కేసీఆర్‌ అన్నారు. గత ఐదున్నరేళ్ళలో ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారో చెప్పగలరా? మెదక్‌ జిల్లాలో అనేక ప్రైవేట్ పరిశ్రమలున్నాయి. కానీ వాటిలో స్థానిక యువతకు ఉద్యోగాలు లభించడం లేదు. అయినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.       పటాన్‌చెరు పారిశ్రామికవాడలో విపరీతంగా కాలుష్యం వెదజల్లుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం వలన స్థానిక ప్రజలు, చిన్న పిల్లలు రకరకాల రోగాలబారిన పడుతున్నారు. సిఎం కేసీఆర్‌ ఎంతసేపు తన గజ్వేల్, సిద్ధిపేట నియోజకవర్గాలు అభివృద్ధి చేసుకుంటే చాలన్నట్లు నిధులు కేటాయించుకొంటున్నారు తప్ప రాష్ట్రంలో మిగిలిన జిల్లాలను, నియోజకవర్గాలను పట్టించుకోవడం లేదు. సంగారెడ్డి జిల్లాకు తెరాస సర్కార్‌ గత ఐదున్నరేళ్ళలో ఏమి చేసిందో చెప్పగలరా?,” అని ప్రశ్నించారు.