కాంగ్రెస్ నేతలకు ఇంకా బుద్ధి రాలేదు: కేటీఆర్‌

రాష్ట్రంలో తెరాస సభ్యత్వానమోదు కార్యక్రమం విజయవంతంగా ముగియడంతో హైదరాబాద్‌ నగరంలోని కెవిబి ఇండోర్ స్టేడియంలో తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అధ్యక్షతన మంగళవారం విజయోత్సవసభ జరిగింది. ఆ సందర్భంగా కేటీఆర్‌ పార్టీ నేతలను, కార్యకర్తలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “తెలంగాణ రాష్ట్రం రాజధాని హైదరాబాద్‌ నగరం అభివృద్ధికి మన ప్రభుత్వం నిరంతరంగా కృషి చేస్తూనే ఉంది. ఇప్పటికే మనం అన్ని రంగాలలో చాలా అభివృద్ధి సాధించాము కానీ ఇంకా సాధించవలసింది చాలా ఉంది. ఒకప్పుడు నిత్యం విద్యుత్ కోతలు, పరిశ్రమలకు పవర్ హాలీడేస్, త్రాగునీరు, సాగునీరు లేక ప్రజలు రోడ్లెక్కి ఆందోళనలు చేయడం వంటివెన్నో చూశాము. కానీ ఇప్పుడు రాష్ట్రంలో 24 గంటలు విద్యుత్ సరఫరా అవుతోంది. హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలో అన్ని జిల్లాలలో త్రాగు,సాగునీటి సమస్యలు తీరుతున్నాయి. చెన్నై నగరంలో నేటికీ త్రాగునీటి సౌకర్యం లేనందున పొరుగు జిల్లాల నుంచి రైల్వే వేగన్లలలో నీటిని తెచ్చుకొంటున్నారు. కానీ మన హైదరాబాద్‌ నగరానికి ఎన్నటికీ అటువంటి సమస్య రాకుండా నగరం చుట్టూ భారీ రిజర్వాయర్లు నిర్మించి నీటిని నిలువచేసుకొంటున్నాము. 

కాళేశ్వరం ప్రాజెక్టును కేవలం మూడేళ్ళలో పూర్తి చేసుకొని పంటలకు నీటిని అందిస్తున్నాము. దేశంలో 50 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే. సిఎం కేసీఆర్‌ అద్భుతమైన పరిపాలన, నిబద్దత కారణంగా హైదరాబాద్‌కు అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఐకియా వంటి అనేక అంతర్జాతీయ కంపెనీలు తరలివస్తున్నాయి. సిఎం కేసీఆర్‌ పట్టుదల, దూరదృష్టి, నిబద్దత కారణంగానే ఇవన్నీ సాధ్యమయ్యాయి. కానీ కాంగ్రెస్‌ నేతల కళ్ళకు ఈ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఏవీ కనబడటంలేదు. ఎంతసేపు సిఎం కేసీఆర్‌పై విమర్శలు చేయడమే వారి పని. వారి పార్టీ తీరు చూసి ఆ పార్టీకి చెందిన నేతలే ఇతర పార్టీలలోకి వెళ్లిపోతున్నారు. ప్రజలు వారికి రెండుసార్లు బుద్ది చెప్పినప్పటికీ వారి తీరు ఏమాత్రం మారలేదు.రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉంటే కాంగ్రెస్‌ నేతలు మాత్రం ఎల్లపుడూ ఏడుస్తునే ఉన్నారు. కానీ వారి ఏడుపులను మనం పట్టించుకోనవసరం లేదు. మనపని మనం చేసుకుపోదాము,” అని అన్నారు.