ఐసిస్‌లో చేరిన హైదరాబాద్‌ ఇంజనీర్ మృతి

హైదరాబాద్‌లోని టోలీచౌక్ ప్రాంతానికి చెందిన ఒక ఇంజనీర్ సిరియావెళ్ళి ఐసిస్‌ ఉగ్రవాదసంస్థలో చేరాడు. కొన్ని నెలల క్రితం సిరియాపై జరిగిన వైమానికదాడిలో అతను చనిపోయాడు. అతనికి భార్య నలుగురు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం వారు సిరియాలో శరణార్దుల శిబిరంలో తలదాచుకొంటున్నారు. తమను స్వదేశం తిరిగి రప్పించేందుకు సాయం చేయవలసిందిగా ఆమె భారత్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడంతో ఈ విషయం బయటపడింది. 

ఆమె చెప్పిన సమాచారం ప్రకారం అతను 2015 నుంచి సౌదీఅరేబియా దేశంలో పనిచేసేవాడు. వారికి ఇద్దరు పిల్లలు కలిగిన తరువాత అతను వారిని అక్కడకు తీసుకువెళ్లిపోయాడు. ఆ తరువాత అతను వారిని తీసుకొని దుబాయ్, అక్కడి నుంచి టర్కీ మీదుగా సిరియాకు మారాడు. ఐసిస్‌లో చేరేందుకే తన భర్త సిరియాకు వచ్చాడనే సంగతి ఆమెకు చాలా కాలం తరువాత తెలిసిందని ఆమె తెలిపింది. వారికి మరో ఇద్దరు పిల్లలు కలిగారు. సంసార భాద్యతలను మరిచి అతను ఐసిస్‌లో చేరడంతో అతనిమీదే ఆధారపడి జీవిస్తున్న వారి జీవితాలు దయనీయంగా మారాయి. 

అతను ఐసిస్‌లో చేరిన సంగతి హైదరాబాద్‌లో నివశిస్తున్న అతని తల్లితండ్రులకు, అత్తమామలకు  కూడా తెలియనీయలేదు. చివరికి వైమానిక దాడులలో చనిపోయిన తరువాత ఈ విషయం బయటపడింది. ఇప్పుడు వారు బాధపడటం తప్ప మరేమీ చేయలేరు. అతని భార్యా, పిల్లలను స్వదేశం రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు కానీ అవి ఎప్పటికీ ఫలిస్తాయో ఎవరికీ తెలీదు. కొంతకాలం క్రితం మంచిర్యాల్ జిల్లాకు చెందిన మహమ్మద్ హనీఫ్ అనే ఇంజనీర్ కూడా ఇదేవిధంగా ఐసిస్‌లో చేరి ప్రాణాలు కోల్పోయాడు. కనుక ఇతను రెండో వ్యక్తి. అతని వివరాలు ఇంకా తెలియవలసి ఉంది.