సిబిఐ కస్టడీలో చిదంబరం

ఒకప్పుడు దేశ ఆర్ధికవ్యవస్థను నడిపించిన మాజీ ఆర్ధికమంత్రి పి.చిదంబరం ఐఎన్‌ఎక్స్‌ మీడియా కుంభకోణం కేసులో అరెస్ట్ అవడమే పెద్ద షాక్ అనుకుంటే, ఆయనకు డిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టు, తాజాగా సిబిఐ కోర్టు వరుసగా షాకులు ఇస్తున్నాయి. ఆయనను సిబిఐ అధికారులు గురువారం సిబిఐ కోర్టులో ప్రవేశపెట్టినా తరువాత సిబిఐ తరపున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఐఎన్‌ఎక్స్‌ మీడియా కుంభకోణం కేసులో చిదంబరాన్ని ప్రశ్నించడానికి 5 రోజులు కస్టడీని కోరారు కానీ న్యాయమూర్తి 4 రోజులకు మాత్రమే అనుమతించారు. సిబిఐ కస్టడీకి కోర్టు అనుమతించడం చిదంబరం.. కాంగ్రెస్‌ నేతలు జీర్ణించుకోలేని విషయమే. కాంగ్రెస్‌ కార్యకర్తలు డిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేసి నిరసనలు తెలియజేశారు. ప్రతీరోజు అర్ధగంటసేపు కుటుంబ సభ్యులు, న్యాయవాదులు చిదంబరాన్ని కలిసేందుకు సిబిఐ కోర్టు అంగీకరించింది. ముందస్తు బెయిల్‌పై కోరుతూ ఆయన వేసిన పిటిషన్‌పై ప్రధానన్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్ నేతృత్వంలో సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టనుంది. ఒకవేళ సుప్రీంకోర్టు బెయిల్‌పై మంజూరు చేసినట్లయితే రేపు విడుదలయ్యే అవకాశం ఉంటుంది.