కేటీఆర్‌కు...నడ్డాకు అదే తేడా: లక్ష్మణ్

బిజెపి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జెపి నడ్డా హైదరాబాద్‌ పర్యటనలో తెరాస సర్కార్‌పై విమర్శలు గుప్పించి వెళ్ళినప్పటి నుంచి తెరాస, బిజెపి నేతల మద్య మాటల యుద్దం నడుస్తూనే ఉంది. 

“నడ్డా ఎవరో నాకు తెలీదు. ఆయన నడ్డా కాదు ఆయన అబద్దాల అడ్డా. కర్ణాటకలో ఆడిన ఆటలు ఇక్కడ సాగవని గుర్తుంచుకోవాలి. రాష్ట్ర బిజెపి నేతలు వ్రాసిచ్చిన విషయాలలో నిజానిజాలు తెలుసుకోకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడి వెళ్ళిపోయారు,” అని కేటీఆర్‌ అన్నారు. 

“ప్రాంతీయ పార్టీ తెరాసకు వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్న కేటీఆర్‌కు జాతీయ పార్టీ బిజెపికి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్న జెపి నడ్డా ఎవరో తెలియదనడం కేటీఆర్‌ అహంకారానికి అద్దం పడుతోంది. ఒకవేళ నిజంగా నడ్డా ఎవరో తెలియకపోతే ఆయన రాజకీయాలకు పనికిరారు. అయినా నడ్డా ఏమీ కేటీఆర్‌లాగా ప్యారాచూట్ నేత కాదు. తండ్రిపేరు చెప్పుకొని రాజకీయాలు చేయడం లేదు. కార్యకర్త స్థాయి నుంచి పైకి ఎదిగిన వ్యక్తి. అటువంటి సీనియర్ నేతను ఉద్దేశ్యించి కేటీఆర్‌, ఆయన భజనపరులు అనుచితంగా మాట్లాడటం సరికాదు. వారి మాటలు వారి దూరంహకారానికి నిదర్శనం,” అని కె.లక్ష్మణ్‌ అన్నారు.

రాజకీయాలలో ఉన్నవారు పరస్పరం విమర్శలు చేసుకోవడం సహజమే కానీ ఒక్కో మెట్టు దిగుతున్న కొద్దీ ఇరుపక్షాలకు ఇటువంటి అవమానకర విమర్శలు భరించక తప్పదు. అందుకు సిద్దమైతేనే ఎదుటవారిని నోటికి వచ్చినట్లు విమర్శించవచ్చు. పార్టీల, ప్రభుత్వాల విధానాలపై హుందాగా విమర్శలు చేసుకుంటే ఇటువంటి దుస్థితి రాదు కదా!