కాళేశ్వరం ప్రాజెక్టులో చేపపిల్లల విడుదల షురూ

కాళేశ్వరంతో సహా రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు, కాలువలు నిండుగా నీళ్ళతో కళకళలాడుతున్నందున వాటిలో చేపపిల్లల విడుదల కార్యక్రమాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం ప్రారంభించారు. తలసాని కోయిల్ సాగర్‌లో, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్వర్ణ ప్రాజెక్టులో, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వరంగల్‌ శివారులో గల మడికొండ పెద్ద చెరువులో చేప పిల్లలను విడిచిపెట్టారు. 

ఈ ఏడాది రాష్ట్రంలో గల 24,953 నీటివనరులలో రూ.52 కోట్లు విలువగల 80.86 కోట్లు చేప పిల్లలను వదలడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలో రొయ్యలకు విపరీతమైన డిమాండ్ ఉన్నందున ఈసారి 5 కోట్ల రొయ్య పిల్లలను కూడా వదలాలని ప్రభుత్వం నిర్ణయించింది.   

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ కార్యక్రమం చాలా విజయవంతం అయ్యింది. ఏటా కోట్లాది చేపపిల్లలను రాష్ట్రంలోని చెరువులు, సాగునీటి కాలువలు, ప్రాజెక్టులలో విడిచిపెడుతున్నందున ఎక్కడికక్కడ స్థానిక మత్య్సకారులకు ఉపాది..ఆదాయం లభిస్తోంది. గతంతో పోలిస్తే ఇప్పుడు రాష్ట్రంలో చేపల లభ్యత కూడా బాగా పెరగడంతో చేపల ధరలు సామాన్య ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.