
అమరావతిలో కృష్ణానది ఒడ్డున మాజీ సిఎం చంద్రబాబునాయుడు నివాసంపై ఇద్దరు వ్యక్తులు డ్రోన్ కెమెరాతో షూట్ చేస్తుండగా టిడిపి కార్యకర్తలు పట్టుకొనడంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధికారుల ఆదేశంతోనే తాము డ్రోన్‌తో చిత్రీకరిస్తున్నామని వారు తెలుపడంతో టిడిపి కార్యకర్తలు మరింత ఆవేశానికి లోనయ్యారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి దేవినేని ఉమ, టిడిపి నేతలు అక్కడకు చేరుకొన్నారు. అప్పటికే అక్కడకు చేరుకున్న పోలీసులు ఆ ఇద్దరు వ్యక్తులను అదుపులో తీసుకొని పోలీస్ స్టేషన్ తరలిస్తుండగా వారిని టిడిపి నేతలు అడ్డుకున్నారు.
జెడ్ ప్లస్ భద్రత కలిగిన మాజీ సిఎం చంద్రబాబునాయుడు నివాసంపై డ్రోన్ కెమెరా ఎగురవేసిన వారిద్దరూ ఎవరు? ఎందుకు ఎగురవేశారో చెప్పాలని టిడిపి నేతలు పట్టు పట్టారు. ఈ సందర్భంగా పోలీసులకు, టిడిపి కార్యకర్తలకు మద్య తోపులాటలు జరిగాయి. పోలీసులు తమకు సరైన జవాబు చెప్పకుండా వారిరువురినీ అక్కడి నుంచి తరలిస్తుండటంతో టిడిపి కార్యకర్తలు రోడ్డుకు అడ్డుగా పడుకొని ఆందోళనకు దిగారు. చంద్రబాబునాయుడు నివాసం వద్ద జరుగుతున్న ఈ గొడవ అన్ని టీవీ ఛానల్స్ లో రావడంతో చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్న టిడిపి కార్యకర్తలు భారీ సంఖ్యలో అక్కడకు చేరుకొన్నారు. దీంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. పోలీసులు కొందరు టిడిపి కార్యకర్తలను కూడా అదుపులో తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
కృష్ణానది ఉదృతంగా ప్రవహిస్తుండటంతో నదీ పరీవాహక ప్రాంతంలో పరిస్థితులను అంచనా వేయడానికి తామే డ్రోన్ కెమెరాతో చిత్రీకరించమని చెప్పామని సాగునీటిశాఖ అధికారులు ప్రకటించారు. కానీ టిడిపి నేతలు, కార్యకర్తలు వారి మాటలను నమ్మడం లేదు. జగన్ ప్రభుత్వం చంద్రబాబునాయుడుకు హాని తలపెట్టేందుకు ఏదో కుట్ర చేస్తోందని వాదిస్తున్నారు.
చంద్రబాబునాయుడు కూడా ఏపీ డిజిపి, జిల్లా ఎస్పీలకు ఫోన్ చేసి ఈ ఘటనపై ఆరా తీశారు. జెడ్ ప్లస్ భద్రత ఉన్న తన నివాసంపై డ్రోన్ కెమెరాతో చిత్రీకరిస్తుంటే ఏమి చేస్తున్నారని నిలదీశారు. ఈ ఘటనపై టిడిపి, వైసీపీ నేతల మద్య మాటల యుద్ధం మొదలైంది. అది ఎటు దారి తీస్తుందో... ఏవిధంగా ముగుస్తుందో చూడాలి.