కేసీఆర్‌ మీద కోపంతో కాంగ్రెస్‌కు గుడ్ బై!

అవును తెలంగాణ సిఎం కేసీఆర్‌ మీద కోపంతో మాజీ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే పార్టీని వీడారు. ఆయనే ఇల్లెందు మాజీ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఊకె అబ్బయ్య. 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గురువారం హనుమంతులపాడు గ్రామంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ, “సిఎం కేసీఆర్‌ పాలనలో ఇల్లెందు నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోవడం లేదు. సిఎం కేసీఆర్‌ అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తున్నా ఇంతవరకు నియోజకవర్గం అభివృద్ధి కోసం ఒక్క పైసా నిధులు విడుదల చేయలేదు. సీతారామ ప్రాజెక్టు శంఖుస్థాపన చేసి దాని గురించి గొప్పలు చెప్పుకోవడమే తప్ప ఏళ్ళు గడుస్తున్నా ఇంతవరకు అక్కడ పనులే మొదలుపెట్టలేదు. ఆ ప్రాజెక్టు జిల్లా కోసమా లేక దాని నుంచి సాగర్‌కు, టెయిల్ పాండ్‌కు నీటిని తరలించుకుపోవడానికి కడుతున్నారా? కొత్త బొగ్గుగనులు ప్రారంభిస్తామని చెప్పి చేతులు దులుపుకున్నారు. సిఎం కేసీఆర్‌ హామీలన్నీ మాటలకే పరిమితం. కనుక నా నియోజకవర్గాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధిచేయగల దమ్మున్న బిజెపిలో చేరాలని నిశ్చయించుకున్నాను. రాష్ట్రంలో తెరాసకు ఏకైక ప్రత్యామ్నాయం బిజెపి మాత్రమేనని నమ్ముతున్నాను. కనుక ఆ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నాను,” అని అన్నారు.