దేశాభివృద్ధిలో పాలుపంచుకొందాం: నరేంద్రమోడీ

ప్రధాని నరేంద్రమోడీ 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో భాగంగా డిల్లీలోని ఎర్రకోతపై త్రివర్ణ పతాకం ఎగురవేసి దేశప్రజలను ఉద్దేశ్యించి ప్రసంగించారు. స్వాతంత్ర్యం కోసం ఆనాడు కోట్లాదిమంది భారతీయులు ఏవిధంగా ఉద్యమించారో అదేవిధంగా ఇప్పుడు భారత్ అభివృద్ధి, పరిశుభ్రత కోసం దేశ ప్రజలందరూ కృషి చేయాలని కోరారు. తమ ప్రభుత్వం అధికారం చేపట్టిన 10 వారాలలోనే దేశహితం కోసం కశ్మీర్‌ విభజన, ఆర్టికల్ 370,35 (ఏ) రద్దు, తీవ్రవాద నిరోదక చట్టం, ట్రిపుల్ తలాక్ నిషేధం వంటి అనేక కీలక నిర్ణయాలు తీసుకొందని అన్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒకే దేశంగా ఉన్నప్పుడు ఒకే రాజ్యాంగం అమలులో ఉండాల్సిన అవసరం ఉంది గనుకనే ఆర్టికల్ 370,35 (ఏ) రద్దు చేసినట్లు ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు.

త్రివిద దళాల మద్య మరింత సమన్వయం కోసం ‘డిఫెన్స్ చీఫ్’ అనే కొత్త పదవిని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. డిఫెన్స్ చీఫ్ నేతృత్వంలో త్రివిద దళాలు పనిచేస్తాయని తెలిపారు. ప్లాస్టిక్ వినియోగం వలన జరుగుతున అనర్ధాలను వివరించిన ప్రధాని నరేంద్రమోడీ, అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజు నుంచి దేశంలో ప్లాస్టిక్ సంచీల వినియోగం మానుకోవాలని దేశప్రజలకు విజ్ఞప్తి చేశారు. దేశ ప్రజలందరూ వస్త్రంతో చేసిన సంచీలను ఉపయోగించేయడం మొదలుపెడితే, దేశంలో లక్షలాది మంది నిరుపేదలు, చిన్న చిన్న సంస్థలు వాటిని తయారుచేస్తాయి కనుక వారందరికీ ఉపాది లభిస్తుందని, దేశ  ఆర్ధికవ్యవస్థ బలపడేందుకు కూడా ఇది చాలా ఉపయోగపడుతుందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు.

వాన నీటి సంరక్షణకు కేంద్రప్రభుత్వం జల సంరక్షణ్ శాఖను ఏర్పాటు చేసి భారీగా నిధులు సమకూర్చిందని, కనుక దేశప్రజలందరూ వాననీటిని భూగర్భంలోకి ఇంకేలా చేయాలని విజ్ఞప్తి చేశారు. దేశంలో అభివృద్ధితో పాటు మౌలికవసతుల కల్పన, పరిశుభ్రతను పెంచేందుకు తమ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు దేశ ప్రజలందరూ తోడ్పడాలని ప్రధాని నరేంద్రమోడీ విజ్ఞప్తి చేశారు.