
తెలంగాణ రాష్ట్రంలో బిజెపి బలోపేతం చేసుకునేందుకు అధికార తెరాసతో సహా వివిద పార్టీల నేతలను చేర్చుకొంటున్న సంగతి తెలిసిందే. అయితే వారందరూ ‘అవుట్ డేటడ్’ నేతలనీ వారు ఏ పార్టీలో ఉన్నా వారి వలన ఎటువంటి ప్రయోజనం ఉండదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
తలసాని మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్రంలో బిజెపి బలపడాలనుకుంటే మాకేమీ అభ్యంతరం లేదు కానీ అవుట్ డేటడ్ నేతలతో పార్టీ బలోపేతం అవుతుందని బిజెపి అనుకోవడమే ఆశ్చర్యం కలిగిస్తోంది. రాష్ట్రంలో బలపడాలనుకునే ముందు బిజెపి నేతలు డిల్లీకి వెళ్ళి ప్రధాని నరేంద్రమోడీతో, కేంద్రమంత్రులతో మాట్లాడి రాష్ట్రానికి రావలసిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులు, అనుమతులు సాధించుకువస్తే ప్రజలు హర్షిస్తారు. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికై, రేయింబవళ్లు రాష్ట్రాభివృద్ధి కోసం శ్రమిస్తున్న సిఎం కేసీఆర్ కుటుంబ సభ్యులను రోజూ తిట్టిపోస్తే రాష్ట్రంలో తెరాసకు బిజెపి ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందనుకోవడం కూడా భ్రమే. కర్ణాటకలో బిజెపి ఏవిధంగా అధికారపార్టీ ఎమ్మెల్యేలను బయటకు లాగి ప్రభుత్వాన్ని కూలద్రోసిందో అందరూ చూశారు. గోవా, ఈశాన్య రాష్ట్రాలలో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఏవిధంగా బిజెపిలోకి ఫిరాయింపజేసుకుందో అందరికీ తెలుసు. బిజెపి చేస్తే సంసారం ఇతరులు చేస్తే వ్యబిచారమా? రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలలో బిజెపి గెలిచినంత మాత్రన్న బిజెపికి ప్రజాధారణ పెరిగిపోయిందనుకోలేము. రాజకీయాలకు ఏమాత్రం పనికిరాని నలుగురు నేతలు ఏదో గాలివాటంగా లోక్సభ ఎన్నికలలో గెలిచేరు తప్ప వారి గెలుపు నిజమైన గెలుపుగా భావించలేము. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్నంత ఓటు బ్యాంక్ బిజెపికి లేదు. త్వరలో జరుగబోయే మున్సిపల్ ఎన్నికలలో బిజెపి సత్తా ఏపాటిదో చూద్దాం,” అని అన్నారు.