అభినందన్ వర్ధమాన్‌కు వీర్‌ చక్ర అవార్డు

వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌కు స్వాతంత్ర్యదినోత్సవవం సందర్భంగా రేపు వీర్‌ చక్ర అవార్డు అందుకోనున్నారు. ఫిబ్రవరి 27వ తేదీన భారత్‌పై దాడికి ప్రయత్నించిన పాక్‌ యుద్ధవిమానాలను అభినందన్ వర్ధమాన్‌ తన మిగ్ విమానంలో తరుముతూ ఎఫ్-16 యుద్దవిమానాన్ని కూల్చేశారు. కానీ పాక్‌ ఎదురుదాడిలో మిగ్ విమానం పాక్‌ సరిహద్దులో కూలిపోవడంతో ఆయన పాక్‌ సైనికులకు బందీగా చిక్కాడు. వారి చేతిలో చిత్రహింసలకు గురైనప్పటికీ భారత్‌ వైమానిక, సైనిక రహస్యాలను బయటపెట్టలేదు. పాక్‌ అధికారులు గుచ్చి గుచ్చి అడిగినప్పటికీ అభినందన్ వర్ధమాన్‌ తన పేరు, వివరాలను మాత్రమే చెప్పాడు తప్ప మరేమీ చెప్పలేదు. ప్రపంచదేశాల ఒత్తిడి కారణంగా పాకిస్థాన్‌ ఆయనను తిరిగి భారత్‌కు అప్పగించవలసి వచ్చింది. శత్రువుల చేతిలో చిక్కినప్పటికీ గొప్ప దేశభక్తిని, అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించినందుకు అభినందన్ వర్ధమాన్‌కు కేంద్రప్రభుత్వం వీర్‌ చక్ర అవార్డు ప్రకటించింది. అభినందన్ వర్ధమాన్‌తో పాటు వాయుసేన స్క్వాడ్రన్‌ లీడర్ మింటీ అగర్వాల్‌ రేపు కూడా యుద్ధసేవా పతకం అందుకోనున్నారు.