విజయశాంతి బిజెపిలోకి?

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత విజయశాంతి మళ్ళీ బిజెపి గూటికి చేరుకోబోతున్నట్లు తాజా సమాచారం. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసుకునే ప్రయత్నాలలో భాగంగా కాంగ్రెస్‌, టిడిపి, తెరాసల నేతలను బిజెపిలోకి రప్పించేందుకు ఆ పార్టీ అగ్రనేతలు తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి విజయశాంతితో సహా కాంగ్రెస్, టిడిపిలకు చెందిన ముగ్గురు మాజీ ఎంపీలు, 8 మంది మాజీ ఎమ్మెల్యేలను బిజెపిలో చేర్చుకునేందుకు రంగం సిద్దం అయినట్లు తెలుస్తోంది. వారితోపాటు ఒక మాజీ ఉప ముఖ్యమంత్రి కూడా బిజెపిలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. నారాయణ్ ఖేడ్ మాజీ టిడిపి ఎమ్మెల్యే విజయ్‌పాల్ రెడ్డి స్వయంగా రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ను కలిసి బిజెపిలో చేరేందుకు సంసిద్దత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈనెల 18న హైదరాబాద్‌ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో బిజెపి ఒక భారీ బహిరంగసభ నిర్వహింకఃబోతోంది. ఆ సభలో బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జెపి నడ్డా సమక్షంలో విజయశాంతితో సహా కాంగ్రెస్‌, టిడిపి, తెరాసలకు చెందిన పలువురు నేతలు బిజెపిలో చేరబోతున్నట్లు తాజా సమాచారం.