
తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల తెలంగాణ వికాస సమితి 3వ రాష్ట్రమహాసభలో ముఖ్యఅతిధిగా పాల్గొన్నప్పుడు జాతీయవాదం, ప్రజాస్వామ్యవిలువలను కాపాడటం గురించి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్ చాలా ఘాటుగా స్పందించారు.
గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “బిజెపితో ఉంటే దేశభక్తులు లేకుంటే దేశద్రోహులు అని అంటున్నట్లుగానే, రాష్ట్రంలో తెరాస సర్కార్ తప్పుడు నిర్ణయాలకు మద్దతు ఇస్తూ భజన చేస్తే తెలంగాణవాదులు లేకుంటే తెలంగాణ ద్రోహులు అన్నట్లు ముద్రలు వేస్తున్నప్పుడు మీకు తప్పుగా అనిపించలేదా? శాసనసభలో, మండలిలో ప్రశ్నించే గొంతులు ఉండకూడదని ప్రతిపక్షాల ఎమ్మెల్యేలను తెరాసలోకి ఫిరాయింపుజేసుకున్నప్పుడు, ప్రజల గొంతులు వినిపించే ధర్నాచౌక్ ఎత్తివేసి, వారిపై అన్యాయంగా కేసులు బనాయించినప్పుడు మీకు ప్రజాస్వామ్యం గుర్తురాలేదా? రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ప్రజాస్వామ్య విలువలు, సమస్యలపై చర్చించడం గురించి ఉపన్యాసాలు ఇవ్వడం చాలా హాస్యాస్పదంగా ఉంది. తెరాస, బిజెపిలు పైకి శత్రువులలాగా పరస్పరం విమర్శలు చేసుకొంటున్నప్పటికీ ఆ రెండూ లోపాయికారీగా వ్యవహరిస్తూ అవసరమైనప్పుడు పరస్పరం సహకరించుకొంటాయి, ” అని దాసోజు శ్రవణ్ అన్నారు.