
తంతే...గారెల గంపలో పడ్డాడు అని అంటుంటాం. అది ఇదేనేమో! గవర్నర్ పదవి లభిస్తుందనే ఆశతో 5 ఏళ్ళు రాజకీయాలకు దూరంగా కాలక్షేపం చేసిన మోత్కుపల్లి నర్సింహులు, ఇక అది రాదని గ్రహించి మళ్ళీ రాజకీయాలలో యాక్టివ్ అవ్వాలనుకున్నారు. కానీ టిడిపిని తెరాసలో విలీనం చేయాలని సలహా ఇచ్చి పార్టీ చేత బహిష్కరణ వేటు వేయించుకున్నారు.
ఆ తరువాత ఏమి చేయాలో పాలుపోక కొన్ని రోజులు చంద్రబాబునాయుడు తిడుతూ కాలక్షేపం చేశారు. అసెంబ్లీ ఎన్నికలు రావడంతో ఆలేరు నుంచి పోటీకి దిగి ‘ఒక్క లాస్ట్ ఛాన్స్ ఇవ్వండంటూ...’ప్రజలను ఎంతగా ప్రాధేయపడినప్పటికీ వారు పట్టించుకోకపోవడం ఓడిపోయారు. దాంతో ఆయన పరిస్థితి మళ్ళీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు మారింది.
భవిష్యత్ అగమ్యగోచరంగా కనిపిస్తున్న ఈ సమయంలో బిజెపి నుంచి ఆహ్వానం అందడంతో ఆయన పరిస్థితి తంతే...గారెల గంపలో పడినట్లయింది. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కె.లక్ష్మణ్ స్వయంగా నిన్న మోత్కుపల్లి ఇంటికి వెళ్ళి బిజెపిలో చేరవలసిందిగా ఆహ్వానించడంతో ఆయన వెంటనే అంగీకరించేశారు. ఈనెల 18న బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు మోత్కుపల్లి నర్సింహులు బిజెపిలో చేరబోతున్నట్లు సమాచారం. ఆయనతో పాటు పలువురు టిడిపి నేతలు కూడా బిజెపిలో చేరబోతున్నారు.