కాళేశ్వరంపై దుష్ప్రచారం మానుకోండి లేకుంటే...

కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, పెట్టుబడి కోసం చేసిన అప్పులు, నిర్వహణ వ్యయం, ప్రయోజనాలు, లాభదాయకతలపై కాంగ్రెస్‌, బిజెపిలు తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. వాటిపై గట్టిగా స్పందించకపోవడంతో ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళుతున్నాయని గ్రహించిన తెరాస శుక్రవారం చాలా ధీటుగా, ఘాటుగా బదులిచ్చింది. 

తెరాస మాజీ ఎంపీ వినోద్ కుమార్ శుక్రవారం కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్రంలో రైతుల సాగునీటి కష్టాలను శాస్వితంగా తీర్చబోతున్న కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కాంగ్రెస్‌, బిజెపి నేతలు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్‌ నేతలు పొన్నం ప్రభాకర్, జీవన్ రెడ్డిలకు ఈ ప్రాజెక్టుపై కనీస అవగాహన కూడా లేకపోయినా నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. తమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మిస్తే తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం పొందవచ్చని వాదిస్తున జీవన్ రెడ్డికి అక్కడ నీటి లభ్యత తక్కువగా ఉంటుందని, ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టు క్రింద రిజర్వాయర్లు నిర్మించుకోవాలని 2008లో జలవనరుల సంఘం చెప్పిన మాట గుర్తు లేదా? నీటి లభ్యత, భౌగోళిక పరిస్థితులను బట్టి ఆ ప్రాజెక్టును సిఎం కేసీఆర్‌ రీడిజైనింగ్ చేసి కాళేశ్వరంగా తీర్చిదిద్ది మూడేళ్ళలో పూర్తి చేసి నీటిని విడుదల చేస్తుంటే కాంగ్రెస్‌, బిజెపి నేతల కళ్ళకు అది కనబడటం లేదా? ప్రాజెక్టు గురించి ఏమాత్రం అవగాహన లేకుండా మాట్లాడుతూ మా ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్‌, బిజెపిలకు ప్రజలే బుద్ధి చెపుతారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా, నిధులు ఇవ్వకుండా దానిపై రాజకీయాలు చేసి ప్రజలను ఆకట్టుకోవాలని బిజెపి ప్రయత్నిస్తోంది. అటువంటి ప్రయత్నాలు చేసినందుకే అసెంబ్లీ ఎన్నికలలో బిజెపికి డిపాజిట్లు రాకుండా ప్రజలు ఓడగొట్టారు. అయినా బిజెపి తీరు మార్చుకోకపోతే దానికే నష్టం,” అని అన్నారు.